అదానీ గ్రూప్‌పై ఇతర దర్యాప్తులేం అక్కర్లేదు

అదానీ గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో గొప్ప ఊరట లభించింది.  గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

Updated : 04 Jan 2024 06:56 IST

సీబీఐ, సిట్‌ దర్యాప్తునకు సుప్రీం నిరాకరణ
సెబీకి మూడు నెలల గడువు
పరుగులు తీసిన గ్రూప్‌ కంపెనీల షేర్లు
అదానీ ఎనర్జీ 12%, అదానీ టోటల్‌ 10% పైకి
దిల్లీ

అదానీ గ్రూప్‌నకు సుప్రీం కోర్టులో గొప్ప ఊరట లభించింది.  గ్రూప్‌ కంపెనీల షేర్ల ధరలు కృత్రిమంగా పెంచేందుకు అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై జరుగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) లేదా కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ, విస్తృత స్థాయి దర్యాప్తు నిర్వహిస్తోందని.. ఆ దర్యాప్తు స్ఫూర్తివంతంగా జరుగుతోందన్న విశ్వాసం తమకుందని కోర్టు వ్యాఖ్యానించింది. అకౌంటింగ్‌ మోసాలు, స్టాక్‌ విలువల పెంపునకు అవకతవకలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై ఒక థర్డ్‌ పార్టీ దర్యాప్తు చేయాలన్న విజ్ఞప్తులను కోర్టు తోసిపుచ్చింది. ఇప్పటికే సెబీ దర్యాప్తు చేసి, అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని పేర్కొన్న సంగతి తెలిసిందే.

మిగిలిన రెండు కేసులనూ పూర్తి చేయండి

మార్కెట్‌ నియంత్రణాధికార సంస్థ అయిన సెబీ పరిధిలోకి చొరబడి, అధికార శాసనాలు రూపొందించేందుకు   సుప్రీం కోర్టుకు పరిమిత అధికారాలే ఉన్నాయంటూ.. పెండింగ్‌లో ఉన్న రెండు కేసులను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సెబీకి సూచించింది. చట్టం నిర్దేశించిన వ్యక్తులు లేదా సంస్థలు చేసే చట్టాలను అధికారిక శాసనం లేదా సెకండరీ శాసనాలుగా పిలుస్తారు. వీటిని నిర్దేశిత పార్లమెంటు చట్టం కింద చేస్తారు.

వాదనలో పస లేదు..

వార్తా పత్రికల్లో వచ్చే వార్తలు లేదా ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌(ఓసీసీఆర్‌పీ) వంటి సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా సెబీ వంటి ఒక నియంత్రణ సంస్థ చేపడుతున్న దర్యాప్తును పిటిషనర్లు ప్రశ్నించడం ‘విశ్వాసాన్ని ప్రేరేపించే చర్య కాదని’ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) డీవై చంద్రచూడ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం పేర్కొంది. న్యాయమూర్తులు జస్టిస్‌ జేబీ పర్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా ఈ ధర్మాసనంలో ఉన్నారు. సెబీ చేట్టిన దర్యాప్తులో ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోకపోవడం కానీ.. అసమర్థత కానీ కనిపించడం లేదని తాము ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు కోర్టు తెలిపింది. ఎఫ్‌పీఐ రెగ్యులేషన్స్‌-2014ను ఉద్దేశపూర్వకంగా పాటించలేదన్న వాదనలోనూ పస లేదని పేర్కొంది.

కారణం కనిపించడం లేదు

అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి 24 కేసుల్లో 22 కేసుల దర్యాప్తును సెబీ ఇప్పటికే పూర్తి చేసిందని ధర్మాసనం గుర్తు చేసింది. ‘ఈ కేసులో నిజనిజాలను పరిశీలించిన మీదట, సెబీ నుంచి దర్యాప్తును వేరే సంస్థకు బదిలీ చేసేందుకు ఎటువంటి కారణమూ కనిపించడం లేదు.  సెబీ వంటి సంస్థ నిర్వహిస్తున్న దర్యాప్తును సిట్‌ లేదా సీబీఐకి బదిలీ చేసే అధికారం ఈ కోర్టుకు లేద’ని 46 పేజీల తీర్పులో వివరించింది.

సత్యమేవ జయతే: అదానీ

‘సుప్రీం కోర్టు తీర్పుతో సత్యానికి విజయం దక్కింది. సత్యమేవ జయతే’ అని గౌతమ్‌ అదానీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ (అంతక్రితం ట్విటర్‌)లో పోస్ట్‌ చేశారు. యధావిధిగా తమ గ్రూప్‌ భారత వృద్ధి గాథలో తన పాత్రను కొనసాగిస్తుందన్నారు. న్యాయవాదులు విశాల్‌ తివారీ, ఎమ్‌.ఎల్‌. శర్మ, కాంగ్రెస్‌ నేత జయ ఠాకూర్‌, అనామిక జైశ్వాల్‌ తదితరులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్స్‌)పై తాజా తీర్పు వెలువడింది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన దర్యాప్తును 2023 ఆగస్టు 14, కల్లా పూర్తి చేయాలని గతేడాది మే 17న సెబీని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత మరో 15 రోజుల గడువును సెబీ కోరింది. గతేడాది నవంబరులో ఇక ఎటువంటి పొడిగింపును కోరబోమని కోర్టుకు సెబీ తెలిపింది. 24 కేసుల్లో 22 కేసుల్లో దర్యాప్తు పూర్తయినందున, మిగిలిన 2 కేసులపైనా దర్యాప్తు మూడు నెలల్లోగా పూర్తి చేయమని సుప్రీంకోర్టు బుధవారం ఆదేశించింది.

దూసుకెళ్లిన షేర్లు

సుప్రీం తీర్పుతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లు బుధవారం దూసుకెళ్లాయి. ఒక దశలో అదానీ ఎనర్జీ 17.83%, ఎన్‌డీటీవీ 11.39%, అదానీ టోటల్‌ 9.99%, అదానీ గ్రీన్‌   9.13%, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 9.11% వరకు లాభాలను ఇచ్చాయి. బుధవారం మొత్తం మీద గ్రూప్‌ కంపెనీల మార్కెట్‌ విలువ రూ.64,000 కోట్లు పెరిగి రూ.15.1 లక్షల కోట్లకు చేరింది. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన 2023 జనవరి 24న అదానీ గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.19.23 లక్షల కోట్లతో పోలిస్తే, ఇప్పటికీ ఇంకా ఇది వెనకబడే ఉంది.


అదానీ పోర్ట్స్‌ ఎండీ బాధ్యతలు కరన్‌కే

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌(ఏపీఎస్‌ఈజడ్‌) సీఈఓ కరన్‌ అదానీకి మేనేజింగ్‌ డైరెక్టర్‌(ఎండీ) బాధ్యతలను అప్పజెప్పినట్లు కంపెనీ తెలిపింది. ఈ బాధ్యతలను ఇది వరకు అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ నిర్వర్తించేవారు. తాజాగా గౌతమ్‌ అదానీ హోదాను ఏపీఎస్‌ఈజడ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మార్చారు. అదే సమయంలో నిస్సాన్‌ మోటార్స్‌ మాజీ గ్లోబల్‌ సీఓఓ అశ్వినీ గుప్తాను ఏపీఎస్‌ఈజడ్‌ కొత్త సీఈఓగా నియమించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని