మేలో నియామకాలు 7% తగ్గాయ్‌

ఈ ఏడాది మేలో నియామకాలు నెమ్మదించాయని.. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 7% తగ్గాయని ఓ నివేదిక పేర్కొంది.

Published : 09 Jun 2023 02:21 IST

వ్యయ నియంత్రణకే కంపెనీల మొగ్గు
అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వల్లే
ఫౌండిట్‌ నివేదిక

ముంబయి: ఈ ఏడాది మేలో నియామకాలు నెమ్మదించాయని.. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 7% తగ్గాయని ఓ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయంగా ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో వ్యయాలను తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. నెలవారీ నియామకాల ధోరణులపై ఫౌండిట్‌ ఈ నివేదికను రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌తో పోల్చినా, మేలో నియామకాలు 4% నెమ్మదించాయని నివేదిక తెలిపింది. అయితే అహ్మదాబాద్‌లో 8%, జైపూర్‌లో 1 శాతం మేర నియామకాలు పెరిగాయి. దేశంలో అవసరాలకు తగ్గ నైపుణ్యాలున్న అభ్యర్థుల లభ్యత కంపెనీలకు సవాలుగా మారిందని, నియామకాలు తగ్గడానికి ఇది కూడా ఓ కారణమని తెలిపింది. ‘ప్రస్తుత నియామక ధోరణులు భారత ఉద్యోగాల విపణి ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి. సవాళ్లున్నప్పటికీ.. వృద్ధి బాటలో నడుస్తున్న కొన్ని రంగాల్లో ఉద్యోగార్థులకు అవకాశాలు బాగానే ఉన్నాయ’ని ఫౌండిట్‌ సీఈఓ శేఖర్‌ గరిసా తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలే కాకుండా షిప్పింగ్‌/ మెరైన్‌, ప్రకటనలు, పబ్లిక్‌ రిలేషన్స్‌, రిటైల్‌, పర్యాటకం లాంటి రంగాల్లో నియామకాలు పెరిగాయని పేర్కొన్నారు.

నైపుణ్యాలు పెంచుకోవాలి..

ప్రస్తుతం కొత్త ఉద్యోగావకాశాలు నెమ్మదించినప్పటికీ.. సమీప భవిష్యత్‌లో ఆర్థిక వ్యవస్థ బలోపేతమైతే అన్ని రంగాల్లో నియామకాలు పుంజుకుంటాయని భావిస్తున్నట్లు తెలిపారు. నైపుణ్యాలకు కంపెనీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఆయా రంగాలకు అవసరమైన తాజా నైపుణ్యాలు పెంపొందించుకోవడంపై ఉద్యోగార్థులు దృష్టి పెట్టాలని సూచించారు.

* ప్రధాన నగరాల్లో ఒకటైన బెంగళూరులో నియామకాలు 24% క్షీణించాయి. దిల్లీ- ఎన్‌సీఆర్‌, ముంబయి, పుణె, హైదరాబాద్‌లలో కూడా ఏడాదిక్రితంతో పోలిస్తే నియామకాలు 9- 16%  తగ్గాయని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని