బజాజ్‌ ఫైనాన్స్‌ లాభం రూ.3,825 కోట్లు

బజాజ్‌ ఫైనాన్స్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం.

Published : 26 Apr 2024 02:21 IST

1800 శాతం డివిడెండ్‌

దిల్లీ: బజాజ్‌ ఫైనాన్స్‌ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.3,825 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే కాల లాభం రూ.3,158 కోట్లతో పోలిస్తే ఇది 21% అధికం. ఏకీకృత ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.11,368 కోట్ల నుంచి రూ.14,932 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం రూ.6,254 కోట్ల నుంచి 28% పెరిగి రూ.8,013 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలూ రూ.7,108 కోట్ల నుంచి రూ.9,830 కోట్లకు పెరిగాయి.

  •   రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.36 (1800%) డివిడెండ్‌ను కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది.  
  •   2024 మార్చి 31 నాటికి కంపెనీ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 30% వృద్ధి చెంది రూ.3,30,615 కోట్లకు చేరాయి.
  •  కంపెనీ స్థూల నిరర్థక ఆస్తులు (జీఎన్‌పీఏలు) 0.85 శాతంగా, నికర నిరర్థక ఆస్తులు 0.37 శాతంగా నమోదయ్యాయి.
  •  పూర్తి ఆర్థిక సంవత్సరం (2023-24)లో కంపెనీ నికర లాభం రూ.14,451 కోట్లకు చేరింది. 2022-23 లాభాం రూ.11,508 కోట్ల కంటే ఇది 26% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.35,690 కోట్ల నుంచి రూ.46,946 కోట్లకు పెరిగింది.

టెక్‌ మహీంద్రా లాభంలో 41% క్షీణత
తుది డివిడెండు రూ.28

దిల్లీ: ఐటీ సేవల కంపెనీ టెక్‌ మహీంద్రా, గత ఆర్థిక సంవత్సరం (2023-24) నాలుగో త్రైమాసికంలో రూ.661 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1117.7 కోట్లతో పోలిస్తే ఇది 41% తక్కువ. ఇదే సమయంలో ఆదాయమూ 6.2% తగ్గి రూ.12,871 కోట్లకు పరిమితమైంది. 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 2022-23తో పోలిస్తే 51.2% క్షీణించి రూ.2,358 కోట్లకు పరిమితమైంది. ఆదాయం 2.4% తగ్గి రూ.51,996 కోట్లకు చేరుకుంది. ‘2024-25లో క్లయింట్ల ఐటీ వ్యయాలు పెరుగుతాయని ఆశిస్తున్నాం. ఇందువల్ల మా ఆదాయం మెరుగుపడుతుందని భావిస్తున్న’ట్లు కంపెనీ సీఈఓ మొహిత్‌ జోషి తెలిపారు.
తగ్గిన ఉద్యోగుల సంఖ్య: డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే సిబ్బంది సంఖ్య 795 తగ్గి 1,45,455కు చేరుకుంది.

మొత్తం డివిడెండు రూ.40: గత ఆర్థిక సంవత్సరానికి రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.28 చొప్పున తుది డివిడెండును కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. వాటాదార్ల ఆమోదం లభిస్తే.. ఆగస్టు 9, ఆలోగా చెల్లిస్తారు. 2023 నవంబరులో ఇచ్చిన రూ.12 మధ్యంతర డివిడెండునూ కలిపితే మొత్తం డివిడెండు రూ.40కి చేరుతుంది.


నెస్లే ఇండియా డివిడెండ్‌ 850%

దిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లే ఇండియా మార్చి త్రైమాసికంలో  రూ.934 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.737 కోట్లతో పోలిస్తే ఇది 27% అధికం. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.4,830 కోట్ల నుంచి రూ.5,267 కోట్లకు పెరిగింది. ‘ఆహార ద్రవ్యోల్బణం అధికమవ్వడం, కమొడిటీ ధరల్లో హెచ్చుతగ్గుల రూపంలో సవాళ్లు ఎదురైనప్పటికీ రెండంకెల వృద్ధిని నమోదు చేశాం. ఈ త్రైమాసికంలో దేశీయ విక్రయాలు రూ.5000 కోట్ల మైలురాయిని అధిగమించాయి’ అని నెస్లే ఇండియా ఛైర్మన్‌, ఎండీ సురేశ్‌ నారాయణన్‌ పేర్కొన్నారు.

  • మార్చితో ముగిసిన 15 నెలల కాలానికి కంపెనీ నికర లాభం రూ.3,933 కోట్లుగా ఉంది. 2022 జనవరి- డిసెంబరులో ఇది రూ.2,390 కోట్లుగా నమోదైంది. మార్చి చివరకు కార్యకలాపాల ఆదాయం రూ.24,394 కోట్లుగా ఉండగా, 2022 జనవరి-డిసెంబరులో ఆదాయం రూ.16,987 కోట్లుగా ఉంది. కంపెనీ ఆర్థిక సంవత్సరాన్ని జనవరి 1- డిసెంబరు 31 నుంచి ఏప్రిల్‌ 1- మార్చి 31కు మార్చుకుంది.
  •  రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.8.50 (850%) తుది డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది.

27% తగ్గిన వేదాంతా లాభం

దిల్లీ: అనిల్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని వేదాంతా గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,369 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదుచేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.1,881 కోట్లతో పోలిస్తే ఇది 27.2 శాతం తక్కువ. ట్యూటికోరిన్‌ ఆస్తుల కోసం ఏకకాల కేటాయింపులు చేయడం ఇందుకు కారణమని సంస్థ పేర్కొంది. మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.38,635 కోట్ల నుంచి రూ.36,093 కోట్లకు తగ్గింది. వార్షిక (2023-24) ఆదాయం కూడా 2% తగ్గి రూ.1,41,793 కోట్లకు చేరినా,  కంపెనీ చరిత్రలో ఇది రెండో అత్యధిక మొత్తమని; ఎబిటా రూ.36,455 కోట్లు సాధించినట్లు సీఎఫ్‌ఓ అజయ్‌ గోయల్‌ తెలిపారు.


ఏసీసీ లాభం నాలుగింతలు

దిల్లీ: అంబుజా సిమెంట్స్‌లో భాగమైన సిమెంట్‌ తయారీ సంస్థ ఏసీసీ గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.945 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.236 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు నాలుగింతలు అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ.4,791 కోట్ల నుంచి రూ.5,409 కోట్లకు పెరిగింది. రూ.10 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.7.5 (75%) చొప్పున డివిడెండ్‌ చెల్లించేందుకు బోర్డు సిఫారసు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని