టీకాలు అందకుంటే కొవిడ్‌ మూడో దశా తీవ్రమే!

కొవిడ్‌-19 రెండో దశ మాదిరే మూడో దశా పరిణామాలూ తీవ్రంగానే ఉండే అవకాశం ఉందని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్‌ నివేదిక అభిప్రాయపడింది. టీకాలు శరవేగంగా వేయడంతో పాటు వైద్య వసతులు మెరుగు పడితే మరణాల సంఖ్య మాత్రం తగ్గొచ్చని విశ్లేషించింది.

Published : 03 Jun 2021 02:07 IST

 వైద్య వసతులు మెరుగైతేనే మరణాలు తగ్గుతాయ్‌

కొవిడ్‌-19 రెండో దశ మాదిరే మూడో దశా పరిణామాలూ తీవ్రంగానే ఉండే అవకాశం ఉందని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రీసెర్చ్‌ నివేదిక అభిప్రాయపడింది. టీకాలు శరవేగంగా వేయడంతో పాటు వైద్య వసతులు మెరుగు పడితే మరణాల సంఖ్య మాత్రం తగ్గొచ్చని విశ్లేషించింది. కొవిడ్‌ రెండోదశ తీవ్రత అదుపులోకి వస్తోందని, దేశవ్యాప్తంగా రోజువారీ కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినప్పటికీ.. మూడో దశకు అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. సాధ్యమైనంత త్వరగా అందరికీ టీకాలు వేయడం, వైద్య మౌలిక వసతులను మెరుగు పరచడం ద్వారా కొవిడ్‌-19 మూడో దశ ప్రభావాన్ని గణనీయంగా తగ్గించుకునే వీలుంటుందని ఎస్‌బీఐ తన నివేదికలో తెలిపింది. కొవిడ్‌-19 విజృంభణ ఎక్కువగా ఉన్న దేశాల్లో రెండో దశ సగటున 108 రోజులు, మూడో దశ 98 రోజుల పాటు ఉండొచ్చని పేర్కొంది. అంతర్జాతీయ అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే.. మూడో దశ కూడా రెండో దశ స్థాయిలో తీవ్రంగానే ఉంటుందని పేర్కొంది. ‘ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటే, తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలయ్యే కేసుల సంఖ్యను పరిమితం చేసుకునే వీలుంటుంది. తద్వారా మరణాల సంఖ్య తగ్గుతుంద’ని పేర్కొంది.  
* అధికారిక గణాంకాల ప్రకారం చూసినా, కొవిడ్‌ వల్ల గత మార్చి ఆఖరుకు 1.62 లక్షల మంది మరణించగా, రెండోదశ తీవ్రతతో 2 నెలల్లోనే ఈ సంఖ్య రెట్టింపునకు మించి 3.30 లక్షలకు చేరింది.
*ఇప్పటికీ దేశంలో 3.2 శాతం మందికే రెండు విడతల టీకాలు అయ్యాయి.
* టీకా కార్యక్రమం వేగవంతం, ఆరోగ్య సంరక్షణ వసతులు మెరుగుపరిస్తే కొవిడ్‌ మూడోదశలో సీరియస్‌ కేసుల సంఖ్యను 20% నుంచి 5 శాతానికి తగ్గించవచ్చని పేర్కొంది. ఫలితంగా మరణాలను 40,000కు పరిమితం చేయొచ్చని వివరించింది.
* 12-18 ఏళ్ల పిల్లలు 15-17 కోట్ల మంది ఉంటారని, వీరి సంరక్షణకు సత్వర చర్యలు అవసరమని పేర్కొంది.
ఎదుర్కొనేందుకు విధివిధానాలు: పీయూశ్‌ గోయల్‌
కొవిడ్‌ మూడో దశ సంక్షోభం వస్తే ఎదుర్కొనేందుకు అవసరమైన విధివిధానాలను సిద్ధం చేయాల్సిందిగా పరిశ్రమ సంఘాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూశ్‌ గోయల్‌ కోరారు. కరోనా ప్రభావం పడిన చిన్నారులకు సాయం చేయాల్సిందిగా సూచించారు. కొవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రస్తుత, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సన్నద్ధతపై పరిశ్రమ సంఘాలతో జరిగిన సమావేశంలో గోయల్‌ ఈ సూచనలు చేశారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts