2021లో పీఈ, వీసీల పెట్టుబడులు 5.78 లక్షల కోట్లు

గత ఏడాది భారతీయ కంపెనీల్లోకి 7,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.78 లక్షల కోట్లు) ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) నిధులు వచ్చినట్లు ఐవీసీఏ, ఈవై నివేదిక వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 62 శాతం అధికం కావడం

Published : 19 Jan 2022 03:41 IST

ముంబయి: గత ఏడాది భారతీయ కంపెనీల్లోకి 7,700 కోట్ల డాలర్ల (సుమారు రూ.5.78 లక్షల కోట్లు) ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ), వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) నిధులు వచ్చినట్లు ఐవీసీఏ, ఈవై నివేదిక వెల్లడించింది. 2020తో పోలిస్తే ఇది 62 శాతం అధికం కావడం విశేషం. ఒప్పందాల సంఖ్య పరంగా చూస్తే 37 శాతం వృద్ధితో 1,266 లావాదేవీలు జరిగాయి. కొవిడ్‌ మహమ్మారి పరిణామాల నుంచి బయటపడేందుకు ప్రపంచ వ్యాప్తంగా పెద్దఎత్తున ద్రవ్య లభ్యతకు కేంద్రీయబ్యాంకులు 2021లో వీలు కల్పించాయి. ఫలితంగా అనేక ఆస్తుల్లో పెట్టుబడులకు వీలు కలిగింది. దీంతో కంపెనీల విలువ కూడా పెరిగింది. 2021 రెండో అర్ధ భాగంలో పెట్టుబడులు బాగా పెరిగాయని ఈవై భాగస్వామి వివేక్‌ సోని వెల్లడించారు. నివేదిక ప్రకారం..

అంకుర సంస్థల్లోకి 2,880 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు తరలి వచ్చాయి. మొత్తం పీఈ/వీసీ పెట్టుబడుల్లో ఇది 37 శాతంగా ఉంది.

100 కోట్ల డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు) విలువ కలిగిన అంకురాలు గత ఏడాది కొత్తగా 44 జతయ్యాయి. అలాంటి కంపెనీలు అధికంగా కలిగిన దేశాల్లో భారత్‌ మూడోస్థానంలో నిలిచింది.

స్థిరాస్తి, మౌలిక రంగాలు కాకుండా మిగతా రంగాల్లో పీఈ/వీసీ పెట్టుబడులు 79 శాతం మేర పెరిగి 6,700 కోట్ల డాలర్లకు చేరాయి.

63 ఒప్పందాల ద్వారానే 2,200 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు తరలివచ్చాయి. ఇవి రెండో అతి పెద్ద ఒప్పంద రకం కాగా, విలువ పరంగా ఇప్పటి వరకు ఇదే అత్యధిక మొత్తం కావడం విశేషం.

ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్‌ పెట్టుబడుల (పీఐపీఈ) ఒప్పందాలు (77) 46 శాతం పెరిగి 450 కోట్ల డాలర్లకు చేరాయి. రుణ పెట్టుబడులు 260 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

2021లో బయటకు వెళ్లిపోయిన పీఈ/వీసీ పెట్టుబడులు కూడా గరిష్ఠాలకు చేరాయి. 4,320 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. 2020తో పోలిస్తే ఇది 7 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. గత రికార్డుతో (2018-2,700 కోట్ల డాలర్లు) పోలిస్తే 60 శాతానికి పైగా నిధులు తరలిపోయాయి.

భవిష్యత్‌ పెట్టుబడుల కోసం నిధుల సమీకరణ గత ఏడాది 6 శాతం తగ్గి 770 కోట్ల డాలర్లుగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని