Updated : 06 Feb 2022 09:24 IST

Debt Schemes: ‘డెట్‌’నూ పట్టించుకోండి

నష్టభయం తక్కువగా ఉండాలని కోరుకునే వారికి డెట్‌ పథకాలు సరిపోతాయి. ఈక్విటీలతో పోలిస్తే ఇవి ప్రత్యేకమే. కాస్త సురక్షితంగా ఉంటూ.. రాబడినీ తక్కువగానే అందిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడినిస్తాయి. అందుకే, ప్రతి వ్యక్తి పెట్టుబడుల జాబితాలో వారి శక్తిని బట్టి, ఈక్విటీలు ఉంటాయి. వీటితోపాటు డెట్‌ పెట్టుబడులూ అవసరం.

స్టాక్‌ మార్కెట్‌ పరుగులు తీస్తుండటంతో ఎంతోమంది షేర్లు, ఈక్విటీ పథకాల్లో మదుపు చేసేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. పెట్టుబడుల జాబితా ఎప్పుడూ వైవిధ్యంగా ఉండాలి. అందుకే డెట్‌ పథకాలూ ఇందులో ఉండాలని నిపుణుల సూచన.

అత్యవసర నిధి కోసం..: ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు కాబట్టి, కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడా సొమ్ము చేతిలో ఉండటం ఎప్పుడూ మంచిది. ఈ మొత్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే అవకాశం ఉండాలి. ఈ డబ్బు రాబడిని సంపాదించేందుకు కాదు. కాబట్టి, అధిక హెచ్చుతగ్గులు ఉండే ఈక్విటీల్లో మదుపు చేయలేం. ఒకవేళ చేసినా.. అవసరం వచ్చినప్పుడు సూచీలు పడిపోతే.. షేర్లను అమ్మినప్పుడు నష్టాలు మిగులుతాయి. అందుకే, లిక్విడ్‌, ఓవర్‌నైట్‌ ఫండ్లలాంటివి అత్యవసర నిధిని పొదుపు చేసేందుకు ఉపయోగపడతాయి. ఈ రెండూ ఓపెన్‌ ఎండెడ్‌ డెట్‌ ఫండ్‌ విభాగంలోకి వస్తాయి. వీటిలో మంచి పథకాలను ఎంపిక చేసుకొని, మదుపు చేయాలి. డబ్బు కావాలనుకుంటే.. అమ్మిన తర్వాత రోజు ఖాతాలో జమ అవుతాయి. అత్యవసర నిధిని బ్యాంకు డిపాజిట్లలోనూ పెట్టుకోవచ్చు.

పీపీఎఫ్‌.. ఈపీఎఫ్‌..: డెట్‌ పెట్టుబడులు అంటే.. సురక్షితంగా ఉంటూ, స్థిరమైన రాబడిని అందించాలి. ఈ నిర్వచనంతో చూస్తే.. ఈపీఎఫ్‌, పీపీఎఫ్‌లనూ డెట్‌ పథకాల కింద చూడొచ్చు. అయితే, ఇవి దీర్ఘకాలిక పెట్టుబడి పథకాలు. ముందుగా డబ్బు తీసుకోవాలంటే.. కొన్ని నిబంధనల మేరకే అనుమతి లభిస్తుంది. ప్రభుత్వ హామీ ఉండటం ఇక్కడ కలిసొచ్చే అంశం. డబ్బుతో అంతగా అవసరం లేనివారు.. ఈ పథకాలను తమ పెట్టుబడి జాబితాలో కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

రికరింగ్‌ డిపాజిట్‌లా: మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి సగటు ప్రయోజనం పొందేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) మేలు. దీన్ని డెట్‌ పథకాల్లోనూ చేయొచ్చు. దీర్ఘకాలిక లక్ష్యంతో రికరింగ్‌ డిపాజిట్‌ల మాదిరిగానే వీటిలోనూ నెలనెలా పెట్టుబడులు పెట్టే వీలుంది. పైగా మూడేళ్లు దాటిన పెట్టుబడులపై వచ్చిన రాబడులకు ద్రవ్యోల్బణానికి సర్దుబాటు చేసి, 20శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. అదే రికరింగ్‌ డిపాజిట్లపై వచ్చిన వడ్డీపై వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వస్తుంది.

ఎఫ్‌డీలకు ప్రత్యామ్నాయమా?: సంప్రదాయ పెట్టుబడులను ఇష్టపడేవారు.. నష్టభయాన్ని ఏమాత్రం భరించలేని వారికి డెట్‌ పథకాలకన్నా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లే మేలు. వడ్డీకి హామీని డెట్‌ ఫండ్లు ఇవ్వలేవు. డెట్‌ ఫండ్లూ.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లాంటివే అనే మాటలు నమ్మొద్దని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కొన్నిసార్లు నష్టపోయే అవకాశమూ ఉంటుందని మర్చిపోవద్దు. మార్కెట్‌ ఆధారంగా పనిచేసే పథకాల్లో అవి ఈక్విటీలైనా.. డెట్‌ పథకాలైనా ఎంతోకొంత నష్టం తప్పకుండా ఉంటుంది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని