మనపై ఉక్రెయిన్‌ ప్రభావమెంత?

కొవిడ్‌-19 మూడు దశల పరిణామాల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. రష్యా- ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల రూపంలో మరో ముప్పు ఆందోళన పెంచుతోంది. ఆ దేశంతో వాణిజ్య పరంగా ప్రత్యక్ష ప్రభావం కంటే.. యుద్ధం వస్తే వివిధ దేశాలపై భద్రతాపరంగాను, ఆర్థికంగాను ప్రతికూల ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతాయనే ఆందోళనలున్నాయి. ఇప్పటికే ముడిచమురు బ్యారెల్‌ ధర ఏడేళ్ల గరిష్ఠమైన 97 డాలర్లకు చేరడం, దిగుమతులపైనే అధికంగా....

Published : 23 Feb 2022 01:31 IST

ఔషధాలు పంపి.. వంటనూనె తెచ్చుకుంటున్నాం
చమురు సరఫరాకు ఆటంకాలు ఎదురవుతాయనే ఆందోళన
పెట్రోలు, బంగారం ధరల భగ్గు

కొవిడ్‌-19 మూడు దశల పరిణామాల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఇంకా పూర్తిగా కోలుకోనేలేదు. రష్యా- ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల రూపంలో మరో ముప్పు ఆందోళన పెంచుతోంది. ఆ దేశంతో వాణిజ్య పరంగా ప్రత్యక్ష ప్రభావం కంటే.. యుద్ధం వస్తే వివిధ దేశాలపై భద్రతాపరంగాను, ఆర్థికంగాను ప్రతికూల ప్రభావం పడొచ్చు. ముఖ్యంగా చమురు రవాణాకు ఆటంకాలు ఎదురవుతాయనే ఆందోళనలున్నాయి. ఇప్పటికే ముడిచమురు బ్యారెల్‌ ధర ఏడేళ్ల గరిష్ఠమైన 97 డాలర్లకు చేరడం, దిగుమతులపైనే అధికంగా ఆధారపడిన భారత్‌ వంటి దేశాలకు వణుకు పుట్టిస్తోంది. ఇందువల్ల పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు తీసుకుంటున్న చర్యలతో, స్టాక్‌మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు నెలకొంటున్నాయి. ఉక్రెయిన్‌తో వాణిజ్య సంబంధాలున్న దేశాలకూ కొంత ఇబ్బందికరమే. మనదేశం కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఉక్రెయిన్‌తో మన ద్యైపాక్షిక వాణిజ్య సంబంధాలు ఏమిటంటే.                    

ఔషధాలు వాళ్లకు..

ఉక్రెయిన్‌కు భారత్‌ నుంచి ఎగుమతి అయ్యే వాటిల్లో ఔషధాలదే సింహభాగం. విలువపరంగా ఉక్రెయిన్‌కు ఔషధాలను అత్యధికంగా ఎగుమతి చేసే దేశాల్లో భారత్‌ మూడోది. జర్మనీ, ఫ్రాన్స్‌లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ర్యాన్‌బాక్సీ, డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, సన్‌ గ్రూపు తదితర భారత కంపెనీలకు ఉక్రెయిన్‌లో కార్యాలయాలున్నాయి. ఈ కంపెనీలు అక్కడ ఇండియన్‌ ఫార్మాస్యూటికల్‌ మ్యాన్‌ఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌ను (ఐపీఎంఏ) కూడా ఏర్పాటు చేసుకున్నాయి.

రియాక్టర్లు/ బాయిలర్‌ యంత్రాలు, మెకానికల్‌ సామగ్రి, నూనె గింజలు, పండ్లు, కాఫీ, తేయాకు లాంటి వాటినీ ఉక్రెయిన్‌కు భారత్‌ ప్రధానంగా ఎగుమతి చేస్తోంది.  

సన్‌ఫ్లవర్‌ నూనె మనకు..

మన దేశానికి పొద్దుతిరుగుడు పువ్వు (సన్‌ ఫ్లవర్‌) నూనెను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఉక్రెయిన్‌ ఒకటి. రసాయనాలు, ఇనుము, ఉక్కు, ప్లాస్టిక్‌ లాంటివి కూడా ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు చేరుతున్నాయి.

ఆసియా పసిఫిక్‌లో భారతే ముఖ్యం..

ఉక్రెయిన్‌కు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా భారత్‌ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌కు ఎగుమతులపరంగా భారత్‌ అయిదో ప్రధాన దేశమని అధికారిక గణాంకాల ద్వారా తెలుస్తోంది. అందువల్ల తాజా ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాలిస్తే ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్యంపైనా ప్రభావం పడొచ్చు.

అంకెల్లో చెప్పాలంటే..

2019-20లో ఉక్రెయిన్‌తో భారత ద్వైపాక్షిక వాణిజ్యం 2.52 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.19,000 కోట్లు)గా నమోదైంది. 2015-16లోని 2.01 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. అయితే టర్నోవరు మాత్రం 2018-19లోని 2.73 బిలియన్‌ డాలర్ల నుంచి 7.59 శాతం తగ్గింది.

స్టాక్‌ మార్కెట్లపై..

రష్యా- ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల ప్రభావంతో కొన్ని రోజులుగా స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతూ నష్టపోతున్నాయి. ఉక్రెయిన్‌ సహా ఐరోపా కూటమి దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీల షేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. యుద్ధం వస్తే ఆ కంపెనీల వ్యాపారాలపై ప్రభావం పడొచ్చని మదుపర్లు ఆందోళన చెందుతుండమే ఇందుకు కారణం.

చమురు- బంగారం పైపైకి..

అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతుండగా, ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కోసం పసిడిలోకి పెట్టుబడులు అధికమవుతున్నాయి. ముడి చమురు బ్యారెల్‌ ధర 97 డాలర్లకు చేరితే, పసిడి ఔన్సు (31.10 గ్రాములు) ధర 1900 డాలర్లను అధిగమించింది. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా గత 3 నెలలుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం లేదు. మార్చిలో ఎన్నికలు పూర్తి కాగానే లీటరుకు రూ.8-9 వరకు ఒకేసారి వీటి ధరలు పెరుగుతాయనే ఆంచనాలు సామాన్యులతో పాటు కంపెనీలకూ ఆందోళన కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం మరీ పెరిగితే, ఆర్‌బీఐ మళ్లీ కఠిన పరపతి విధాన వైఖరికి మారే అవకాశం ఉంటుంది.


బండి తీయలేమా?

బ్రెంట్‌ చమురు బ్యారెల్‌ ధర మంగళవారం ఉదయం ఒకదశలో 99.38 డాలర్లకు చేరినా, తదుపరి కాస్త ఉపశమించి 97 డాలర్ల వద్ద కదలాడుతోంది. 2014 సెప్టెంబరులో 99 డాలర్ల పైకి చేరిన బ్యారెల్‌ ముడిచమురు, మళ్లీ ఆ స్థాయికి చేరడం ఇప్పుడే. ఐరోపా సహజ వాయువులో మూడో వంతు; అంతర్జాతీయ చమురు ఉత్పత్తిలో 10 శాతం వాటా రష్యాకు ఉంది. రష్యా గ్యాస్‌.. ఉక్రెయిన్‌ మీదుగా వేసిన గొట్టాల ద్వారానే ఐరోపాకు సరఫరా అవుతుంది. రష్యా నుంచి మన దేశానికి వచ్చే చమురు సరఫరా చాలా తక్కువ. 2021లో రోజుకు 43,400 బారెళ్ల మేర చమురును దిగుమతి చేసుకున్నాం. ఇది మొత్తం దిగుమతుల్లో 1 శాతమే. బొగ్గు కూడా 1.3 శాతం(1.8 మి. టన్నుల) మేర మాత్రమే ఆ దేశం నుంచి కొంటాం.

మార్చిలో ధరల పెంపు

దేశీయ ఇంధన ధరలను అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుసంధానం చేసి, ఏరోజు కారోజు మార్పు చేస్తున్నారు. అయితే 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, గత 110 రోజులుగా ఎటువంటి సవరణా చేయలేదు. బ్యారెల్‌ ధర 82-83 డాలర్ల స్థాయిలో ఉన్నప్పుడు అమలు చేసిన ధరలే ఇప్పుడూ అమలవుతున్నాయి. ఇప్పటివరకు బ్యారెల్‌ ధర 14 డాలర్లు పెరిగింది. ధరలను స్థిరంగా ఉంచిన కాలంలో చమురు కంపెనీలకు అయిన అదనపు వ్యయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని, పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ.8 -9 పెంచవచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.
1 డాలరుకు: ముడి చమురు ధర 1 డాలరు పెరిగితే.. దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధర 45 పైసలు వరకు పెరగొచ్చు.

స్థిరత్వానికి సవాలు

- ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం; పెరుగుతున్న ముడి చమురు ధరలు దేశంలో ఆర్థిక స్థిరత్వానికి సవాలు విసరొచ్చు. చమురు ధరలు ఎక్కడకు వెళతాయో చెప్పడం కష్టం. ఉక్రెయిన్‌ పరిస్థితులు చక్కబడితేనే ఈ ఇబ్బందులన్నీ తొలగుతాయి. చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ధరలపై నిర్ణయం తీసుకుంటాయి.

సరఫరా ఇబ్బందులు రావొచ్చు
- హెచ్‌పీసీఎల్‌ సీఎండీ ఎమ్‌కే సురానా

 

పెరిగిన ముడి చమురు ధరల కారణంగా సరఫరా ఇబ్బందులు రావొచ్చు. రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇరాన్‌-అమెరికా చర్చల నుంచి వచ్చే వైరుధ్య నిర్ణయం, అవసరానికి తగినట్లుగా చమురు ఉత్పత్తిని ఒపెక్‌ దేశాలు పెంచకపోవడం వంటివి చమురు ధరలపై ప్రభావం చూపొచ్చు..  ప్రస్తుతానికి రోజుకు 9 లక్షల బారెళ్ల కొరత ఉంది. ఉక్రెయిన్‌ పరిణామాలు అధ్వానంగా మారితే సరఫరా వైపు తీవ్ర సమస్యలు వస్తాయి.   


కొనసాగిన భయాలు
సెన్సెక్స్‌ 900 పాయింట్లు కోలుకున్నా, 383 పాయింట్ల నష్టం

సూచీల నష్టాలు వరుసగా అయిదో రోజూ కొనసాగినా, భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో టీసీఎస్‌, రిలయన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ భయాలు పెరగడంతో అంతర్జాతీయ సంకేతాలు ప్రతికూలంగా మారాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు నష్టాలకు తోడయ్యాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 29 పైసలు తగ్గి 74.84 వద్ద ముగిసింది. ఆసియా -ఐరపామార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 56,438.64 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 1300 పాయింట్ల మేర కోల్పోయిన సూచీ.. 56,394.85 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరింది. అనంతరం కోలుకుని నష్టాలు తగ్గించుకున్న సెన్సెక్స్‌ 382.91 పాయింట్లు తగ్గి 57,300.68 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 114.45 పాయింట్ల నష్టంతో 17,092.20 దగ్గర స్థిరపడింది.  

నష్టాలు పరిమితం అయ్యేందుకు: ఉత్తర ప్రాంతంలో రష్యా మిలటరీ బేస్‌ ఏర్పాటు చేయడం లేదన్న వార్తలకు తోడు, తక్కువ ధరల్లో లభిస్తున్న షేర్లను దేశీయ మదుపర్లు కొనుగోలు చేయడంతో సూచీలకు భారీ నష్టాలు తప్పాయి.
నీ సెన్సెక్స్‌ 30 షేర్లలో 19 నీరసపడ్డాయి. టాటా స్టీల్‌ 3.64%, టీసీఎస్‌ 3.59%, ఎస్‌బీఐ 2.67%, డాక్టర్‌ రెడ్డీస్‌ 2.02%, ఐటీసీ 1.44%, భారతీ ఎయిర్‌టెల్‌ 1.39%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 1.39%, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1.38%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.20%, విప్రో 1.15% డీలాపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎం అండ్‌ ఎం, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌ 1.36% వరకు రాణించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని