Published : 22 May 2022 03:10 IST

తెలుగు రాష్ట్రాల్లోనూ చిప్‌ తయారీ యూనిట్లు

కార్పొరేట్‌ దిగ్గజాల పరిశీలన
భాగస్వామ్యాలు, పెట్టుబడులకు యత్నాలు
విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఇంజినీరింగ్‌ పాఠ్యాంశాల్లో మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: దేశీయంగా చిప్‌ (సెమీ కండక్టర్‌) యూనిట్లు నెలకొల్పేందుకు కార్పొరేట్‌ దిగ్గజాలు, కొన్ని విదేశీ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలనూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ యూనిట్ల వల్ల రెండు నుంచి అయిదేళ్ల వ్యవధిలో సెమీకండక్టర్‌ డిజైన్‌, డెవలప్‌మెంట్‌, ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ విభాగాలతో పాటు చిప్‌ల తయారీ కార్యకలాపాల్లో ఉద్యోగావకాశాలు భారీగా లభిస్తాయని అంచనా వేస్తున్నారు. దీనికనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇంజినీరింగ్‌ కాలేజీల్లో పాఠ్య ప్రణాళికలో మార్పులు చేసే అంశాన్ని ఏఐసీటీఈ (ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌) పరిశీలిస్తోంది. ఐఐటీ-హైదరాబాద్‌, మరికొన్ని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు బీటెక్‌లో సెమీకండక్టర్‌ డిజైన్‌ కోర్సు ప్రారంభించే యత్నాల్లో ఉన్నాయి. అమృత యూనివర్సిటీ, బీటెక్‌ ఫిజిక్స్‌ ఇన్‌ సెమీకండక్టర్‌ డివైజెస్‌ అనే కోర్సును ఇప్పటికే అందిస్తోంది. ఇదేతరహా కోర్సులను ఇతర యూనివర్సిటీలూ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

పీఎల్‌ఐ పథకంతో..

‘కొవిడ్‌’ పరిణామాల అనంతరం చిప్‌ల సరఫరా తగినంతగా లేక సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌ట్యాప్‌ల వంటి ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులతో పాటు కార్లను కూడా గిరాకీకి తగ్గట్లుగా అందించలేని పరిస్థితి దేశీయ కంపెనీలకు ఎదురైంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని దేశీయంగా సెమీకండక్టర్‌ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.76,000 కోట్ల ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) పథకాన్ని ఆవిష్కరించింది. తదుపరి కొన్ని అగ్రశ్రేణి కార్పొరేట్‌ సంస్థలు సెమీకండక్టర్‌ తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. కర్ణాటక రాష్ట్రం ఇప్పటికే సెమీకండక్టర్‌ పాలసీని ఆవిష్కరించింది. రెండేళ్లలో మనదేశంలో చిప్‌ల ఉత్పత్తి ప్రారంభిస్తామని వేదాంతా గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ ఇప్పటికే ప్రకటించారు. ఫాక్స్‌కాన్‌ అనే తైవాన్‌ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుని, చిప్‌ల తయారీ యూనిట్‌ నెలకొల్పడానికి వేదాంతా గ్రూపు ప్రయత్నాలు చేస్తోంది. ఫాక్స్‌కాన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఎన్నో ఏళ్లుగా సెల్‌ఫోన్‌ అసెంబ్లింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తైవాన్‌కు చెందిన తైవాన్‌ సెమీకండక్టర్‌ మానుఫ్యాక్చరింగ్‌ కంపెనీ (టీఎస్‌ఎంసీ), ఐసీఎస్‌ఎస్‌ వెంచర్స్‌,  ఐఎస్‌ఎంసీ.. తదితర సంస్థలు మనదేశంలో ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టే అవకాశాలను పరిశీలిస్తున్నాయి. ఈ రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం) అనే సంస్థను ఏర్పాటు చేసింది. సెమీకండక్టర్ల తయారీ సంస్థలతో పాటు ఈ రంగంలోకి పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. 

మానవ వనరులే ముఖ్యం

సెమీకండక్టర్‌ రంగానికి నైపుణ్యాలు, విశేష అనుభవం ఉన్న మానవ వనరులు అవసరం. విద్యార్థులకు ఆయా నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వాల్సిందే. ఒక అంచనా ప్రకారం 2050 నాటికి ఎలక్ట్రానిక్స్‌- సెమీకండక్టర్స్‌ తయారీ రంగంలో మనదేశంలో కోటి ఉద్యోగాలు ఉంటాయి. వచ్చే రెండేళ్లలోనే లక్షకు పైగా కొత్త ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని