Published : 29 May 2022 02:34 IST

రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌కు రూ.138 కోట్ల వార్షిక లాభం

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన హైదరాబాద్‌కు చెందిన వైద్య సేవల సంస్థ రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.212 కోట్ల ఆదాయాన్ని, రూ.12.3 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి ఆదాయం రూ.973.8 కోట్లు, నికర లాభం రూ.138.7 కోట్లు ఉన్నాయి. అంత క్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆదాయం 50 శాతం, నికర లాభం 250 శాతం పెరిగాయి. కానీ గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఫలితాలతో చూస్తే.. నాలుగో త్రైమాసికంలో ఆదాయం, నికర లాభం వరుసగా 15 శాతం, 73 శాతం తగ్గాయి. వాటాదార్లకు ఒక్కో షేర్‌కు (రూ.10 ముఖ విలువ) 20 శాతం చొప్పున డివిడెండ్‌ చెల్లించాలని యాజమాన్యం ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని హిమాయత్‌ నగర్‌, నానక్‌రామ్‌గూడలో ఆస్పత్రులు ఏర్పాటు చేసే పనులు చురుకుగా సాగుతున్నట్లు, అదేవిధంగా చెన్నైలోని షోలింగనల్లూర్‌లోనూ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు రెయిన్‌బో యాజమాన్యం వెల్లడించింది. ఇదే కాకుండా బెంగుళూరులో నూతన ఆస్పత్రిని ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్నట్లు, త్వరలో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకోనున్నామని పేర్కొంది. దీనివల్ల రెయిన్‌బోకు ఉన్న వైద్య పడకల సామర్థ్యం పెరిగే అవకాశం ఏర్పడుతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు 14 ఆస్పత్రుల్లో 1500 పడకల సామర్థ్యం ఉంది. ‘కొవిడ్‌’ ఎదురైన ఇబ్బందులు, ఇతర సవాళ్లను సమర్థంగా ఎదుర్కొని గత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలు నమోదు చేసినట్లు రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ ఎండీ డాక్టర్‌ రమేష్‌ కంచర్ల వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నామని పేర్కొన్నారు. దీనివల్ల ఆదాయాలు, లాభాలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన వివరించారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని