ప్రాణంతక వ్యాధులపై పోరుకు ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతికత

కొవిడ్‌ వ్యాధికి మనదేశంలో తొలిసారిగా ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకా అందుబాటులోకి వస్తోంది. పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జెన్నోవా బయోఫార్మా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన టీకా

Published : 30 Jun 2022 02:14 IST

దేశీయంగా తొలి టీకా ఆవిష్కరించిన జెన్నోవా బయోఫార్మా

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ వ్యాధికి మనదేశంలో తొలిసారిగా ఎంఆర్‌ఎన్‌ఏ ఆధారిత టీకా అందుబాటులోకి వస్తోంది. పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న జెన్నోవా బయోఫార్మా ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతించడమే ఇందుకు కారణం. ఇప్పటి వరకు మనదేశంలో లభిస్తున్న టీకాలు భిన్నమైన సాంకేతిక పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్నవే. భారత్‌ బయోటెక్‌ ఆవిష్కరించిన ‘కొవాగ్జిన్‌’ టీకాను ఇన్‌-యాక్టివేటెడ్‌ వీరో సెల్‌ టెక్నాలజీతో రూపొందించారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌, వైరల్‌ వెక్టార్‌ ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తయారైంది. బయొలాజికల్‌ ఇ.లిమిటెడ్‌ సంస్థ రీ-కాంబినెంట్‌ ప్రొటీన్‌ సబ్‌యూనిట్‌ టీకాను (కార్బెవ్యాక్స్‌) ఉత్పత్తి చేస్తోంది.  

ఈ పరిజ్ఞానం కోసం:  మనదేశానికి ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేనందునే, టీకాల తయారీకి ఇతర సాంకేతిక పరిజ్ఞానాల మీద ఆధారపడాల్సి వచ్చింది. అదే సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో అగ్రశ్రేణి ఫార్మా కంపెనీలైన ఫైజర్‌- బయాన్‌టెక్‌, మొడెర్నా సంస్థలు ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలను ఆవిష్కరించాయి. ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికైనా మనదేశానికి అవసరమనే అభిప్రాయం శాస్త్ర, సాంకేతిక నిపుణుల్లో ఉంది. ఎంఆర్‌ఎన్‌ఏ ప్లాట్‌ఫామ్‌తో మలేరియా, డెంగీ, టీబీ.. వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు టీకాలు ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎంఆర్‌ఎన్‌ఏ ప్లాట్‌ఫామ్‌తో కొవిడ్‌ టీకాను ఏదైనా దేశీయ సంస్థ అభివృద్ధి చేస్తే, దీర్ఘకాలంలో మనదేశానికి, ఔషధ పరిశ్రమకు మేలు జరుగుతుందని భావించారు.

జెన్నోవా బయోఫార్మా ఎంఆర్‌ఎన్‌ఏ ప్లాట్‌ఫామ్‌ ఆధారిత కొవిడ్‌ టీకాను ఆవిష్కరించి, దేశవ్యాప్తంగా 4,000 మంది వాలంటీర్లతో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించింది. ఫైజర్‌-బయాన్‌టెక్‌, మొడెర్నా సంస్థలు ఇదే ప్లాట్‌ఫామ్‌ ఆధారంగా తీసుకువచ్చిన కొవిడ్‌ టీకాలను సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. కానీ జెన్నోవా టీకాకు ఆ అవసరం లేదు. మనదేశంలో ఇప్పటికే దాదాపుగా ప్రజలందరికీ కొవిడ్‌ టీకాలు లభించాయి. ఇంకా అవసరమైన మేరకు టీకా నిల్వలు ఉన్నాయి. అందువల్ల జెన్నోవా బయోఫార్మా నుంచి వచ్చే కొవిడ్‌ టీకాకు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా చూస్తే, ఇది ఎంతో పెద్ద విషయమని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.


70 లక్షల టీకా డోసులు సిద్ధం

కొవిడ్‌ వ్యాధికి ఎంఆర్‌ఎన్‌ఏ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా ఉత్పత్తి చేసిన ‘జెమ్‌కోవ్యాక్‌-19’ టీకా తమ వద్ద 70 లక్షల డోసులు సిద్ధంగా ఉన్నాయని జెన్నోవా బయో వెల్లడించింది. ఎమ్‌క్యూర్‌ ఫార్మాకు అనుబంధ సంస్థ అయిన జెన్నోవాకు ఏటా 20 కోట్ల డోసుల టీకా ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. కొవిడ్‌ వ్యాధికి మనదేశం నుంచి తొలి ఎంఆర్‌ఎన్‌ఏ టీకా ఇదేనని, ప్రపంచ వ్యాప్తంగా మూడోదని జెన్నోవా ముఖ్య కార్యకలాపాల అధికారి (సీఓఓ) సమిత్‌ మెహతా తెలిపారు. టీకా అవసరాన్ని బట్టి నెలకు 40-50 లక్షల డోసులు ఉత్పత్తి చేయగలమని ఆయన వివరించారు. టీకా ధరను ఇంకా నిర్ణయించలేదని, దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తున్నామని అన్నారు. దీన్ని బూస్టర్‌ డోసుగా వినియోగించడానికి, పిల్లలకు ఇచ్చేందుకు అవసరమైన క్లినికల్‌ పరీక్షలు త్వరలో చేపడతామని వెల్లడించారు. లాటిన్‌ అమెరికా, ఆగ్నేయాసియాకు చెందిన 25-30 దేశాలకు టీకా సరఫరా చేయాలనే ఆలోచన ఉందని, ఇందుకు ఎమ్‌క్యూర్‌ ఫార్మాకు ఉన్న విక్రయాల వ్యవస్థను వినియోగించుకుంటామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని