సంక్షిప్త వార్తలు

డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (డీసీహెచ్‌ఎల్‌) వ్యవస్థాపకుడు తిక్కవరపు వెంకట్రామిరెడ్డిని దివాలాదారుగా ప్రకటిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఇటీవల తీర్పు వెలువరించింది. వెంకట్రామిరెడ్డి హామీదారుగా డీసీహెచ్‌ఎల్‌ రూ.62.96 కోట్లు రుణాన్ని

Updated : 03 Jul 2022 03:34 IST

దివాలాదారుగా టి.వెంకట్రామిరెడ్డి

డెక్కన్‌ క్రానికల్‌ రుణ వ్యవహారంలో ఎన్‌సీఎల్‌టీ ఉత్తర్వులు

ఈనాడు, హైదరాబాద్‌: డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ (డీసీహెచ్‌ఎల్‌) వ్యవస్థాపకుడు తిక్కవరపు వెంకట్రామిరెడ్డిని దివాలాదారుగా ప్రకటిస్తూ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్‌ ఇటీవల తీర్పు వెలువరించింది. వెంకట్రామిరెడ్డి హామీదారుగా డీసీహెచ్‌ఎల్‌ రూ.62.96 కోట్లు రుణాన్ని చెల్లించకపోవడంతో దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలంటూ ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ బి.ఎన్‌.బద్రీనాథ్‌, జస్టిస్‌ ఎ.వీరబ్రహ్మారావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. బ్యాంకు తరఫున సీనియర్‌ న్యాయవాది కె.వివేక్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ 2011లో వెంకట్రామిరెడ్డి హామీదారుగా డీసీహెచ్‌ఎల్‌కు రూ.25 కోట్ల రుణాన్ని ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ మంజూరు చేసిందన్నారు. దీన్ని చెల్లించకపోవడంతో ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించగా, 15% వడ్డీతో చెల్లించాలని ఆర్బిట్రేషన్‌ ట్రైబ్యునల్‌ ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీనిపై వెంకట్రామిరెడ్డి ముంబయి హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్‌ను కొట్టివేసిందని, అయినా ఇప్పటివరకు చెల్లించకపోవడంతో ఉత్తర్వుల అమలు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందన్నారు. వెంకట్రామిరెడ్డి తరఫు న్యాయవాది ఈ వాదనతో విభేదిస్తూ ప్రస్తుతం కంపెనీ రుణ పరిష్కార ప్రణాళికలో ఉందని, శ్రేయీ మల్టిపుల్‌ అసెట్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ట్రస్ట్‌ విజన్‌ ఇండియా ఫండ్‌ ప్రణాళికను ఈ ట్రైబ్యునల్‌ ఆమోదించిందని తెలిపారు. అంతేగాకుండా రెలిగేర్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని, అందువల్ల ఈ పిటిషన్‌ చెల్లదన్నారు. కాలపరిమితి ముగిసిందన్న వాదనను ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది. వెంకట్రామిరెడ్డిని దివాలాదారుగా ప్రకటిస్తూ దివాలా పరిష్కార నిపుణులుగా రేణుకాదేవిని నియమించింది. 30 రోజుల్లో రుణదాతల జాబితాను రూపొందించి, అనంతరం రుణ పరిష్కార ప్రణాళికను సమర్పించాలని ఆదేశించింది.


భారతీయ ఔషధ పరిశ్రమ మారాలి

పరిమాణం నుంచి విలువ వైపునకు..

కేంద్ర మంత్రి మన్సుఖ్‌ మాండవీయ  

దిల్లీ: అంతర్జాతీయ విపణిని ఆకర్షించడానికి భారతీయ ఔషధ పరిశ్రమ ‘పరిమాణం’ నుంచి ‘విలువ’ వైపునకు మారాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర రసాయనాలు, ఎరువులు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. దీనికి మద్దతుగా పరిశ్రమకు అనుకూలమైన విధానాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని  హామీనిచ్చారు. భారతీయ ఔషధ కూటమితో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ ‘దేశీయ ఔషధ సంస్థలు.. అంతర్జాతీయంగా ఆయా ఫార్మా కంపెనీలు పాటిస్తున్న ఉత్తమ విధానాలను బాగా గమనించి, దేశీయ గిరాకీకి తగ్గట్లు సొంత నమూనాల్ని అభివృద్ధి చేసుకోవాలి. అంతర్జాతీయంగా ఉన్నత స్థానం సంపాదించేందుకు భారతీయ కంపెనీలు ఇవాళ సిద్ధంగా ఉన్నాయ’ని అన్నారు.


మూడు నెలలకోసారి కరెన్సీ యంత్రాలను తనిఖీ చేయాలి

బ్యాంకులకు ఆర్‌బీఐ మార్గదర్శకాలు

ముంబయి: కరెన్సీ నోట్లను విలువ ఆధారంగా వేరు చేసే యంత్రాల పనితీరును కనీసం మూడు నెలలకోసారి కచ్చితంగా తనిఖీ చేయాలని బ్యాంకులకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సూచించింది. 2016లో నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ.200, రూ.500, రూ.2000 నోట్లు అందుబాటులోకి వచ్చాయి. నోట్లను వర్గీకరించే సమయంలో, వాటిని పలు రకాలుగా పరీక్షించాకే తిరిగి చెలామణిలోకి అనుమతించాలని ఆర్‌బీఐ సూచించింది. నోట్లు పాడైనట్లుగా గుర్తిస్తే, వాటిని నిలిపి వేయాలని తెలిపింది. ఆ యంత్రాలకు దొంగనోట్లను గుర్తించే సామర్థ్యం ఉందా లేదా అన్నదీ పరిశీలించాలని సూచించింది. యంత్రాలు తిరస్కరించిన నోట్లను, బ్యాంకు సిబ్బంది మరోసారి నిశితంగా పరిశీలించాకే తుది నిర్ణయం తీసుకోవాలని మార్గదర్శకాల్లో ఆర్‌బీఐ స్పష్టం చేసింది.


ఆయిల్‌ ఇండియా ఛైర్మన్‌గా హరీశ్‌ మాధవ్‌కు అదనపు బాధ్యతలు

దిల్లీ: ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) ఛైర్మన్‌గా హరీశ్‌ మాధవ్‌ అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈయన ఆయిల్‌ ఇండియాలో డైరెక్టర్‌ (ఫైనాన్స్‌)గా పనిచేస్తున్నారు. ఇంతకుమునుపు సంస్థకు ఛైర్మన్‌గా ఉన్న సుశీల్‌ చంద్ర మిశ్రా జూన్‌ 30న పదవీ విరమణ చేశారు. దీంతో జూలై 1 నుంచి హరీశ్‌ ఛైర్మన్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారని ఆయిల్‌ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. హరీశ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియాలో (ఐసీఏఐ) సభ్యుడిగా ఉన్నారు. ఆయిల్‌ ఇండియాలో చేరడానికి ముందు హిందుస్థాన్‌ పెట్రోలియమ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లోనూ పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని