Published : 06 Jul 2022 03:43 IST

వివో, అనుబంధ కంపెనీలపై ఈడీ సోదాలు

దిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ వివో, దాని అనుబంధ సంస్థలపై దేశ వ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) మంగళవారం సోదాలు నిర్వహించింది. దిల్లీ, ఉత్తర్‌ ప్రదేశ్‌, మేఘాలయ, మహారాష్ట్రతో పాటు ఇతర ప్రాంతాల్లోని వివో, దాని అనుబంధ కార్యాలయాలపై మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) సెక్షన్ల కింద ఈ సోదాలు జరిపింది. ఇటీవల దిల్లీ పోలీస్‌ (ఆర్థిక నేరాల విభాగం) విభాగం జమ్ము, కశ్మీర్‌లోని ఒక డిస్ట్రిబ్యూటర్‌ ఇచ్చిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. కొంతమంది చైనా వాటాదార్లు తమ గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేశారన్నది ఆరోపణ.దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఈడీ మనీ లాండరింగ్‌ కేసు నమోదు చేసింది. భారత పన్ను విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీల కళ్లు గప్పి అక్రమంగా నిధుల్ని విదేశాలకు తరలించే ఉద్దేశంతోనే, గుర్తింపు పత్రాలను ఫోర్జరీ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్న ఈడీ ఈ మేరకు భారీగా సోదాలు నిర్వహించింది.

* ‘బాధ్యతాయుత కార్పొరేట్‌ సంస్థగా దర్యాప్తు అధికారులతో సహకరిస్తున్నాం. వారు అడిగిన సమాచారం అందిస్తున్నాం. భారతీయ చట్టాలకు లోబడే సంస్థ నడుస్తోంద’ని వివో భారత అధికార ప్రతినిధి వెల్లడించారు.

* భారతీయ స్మార్ట్‌ఫోన్‌ విపణిలో 2022 తొలి త్రైమాసికంలో వివో 15 శాతం వాటా దక్కించుకుంది. మార్కెట్‌ పరిశోధన, విశ్లేషణ సంస్థ ఐడీసీ ప్రకారం, 55 లక్షల స్మార్ట్‌ఫోన్లను వివో ఆ సమయంలో విక్రయించింది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం.. 5జీ స్మార్ట్‌ఫోన్లలో వివో అగ్రస్థానంలో నిలిచింది. రూ.10,000-20,000 ధరల్లో 5జీ ఫోన్లను సంస్థ విక్రయిస్తున్నట్లు తెలిపింది.

ఆర్థిక నేరాల బాటలో..: చైనా సంస్థలు, వాటి భారతీయ కార్యకలాపాలపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో ఇటీవలి కాలంలో వాటిపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయి. చైనా సంస్థలు తీవ్ర ఆర్థిక నేరాలకు పాల్పడుతూ, పన్ను ఎగవేత, మనీ లాండరింగ్‌కు దిగుతున్నాయనే అనుమానాలున్నాయి. గత ఏప్రిల్‌లో చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థ షియోమికి సంబంధించిన రూ.5,551 కోట్ల డిపాజిట్లను విదేశీ మారకపు నిర్వహణ చట్టం కింద జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో చైనా టెలికాం కంపెనీ హువావే ప్రాంగణాల్లో ఆదాయపు పన్ను విభాగం అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ కూడా పన్ను విధించదగ్గ ఆదాయాన్ని తక్కువ చేసి చూపిందని తేల్చారు. గత ఏడాది డిసెంబరులోనూ షియోమి, ఓపో, వివో, వాటి డిస్ట్రిబ్యూటర్లు, అసోసియేట్లపై ఐటీ విభాగ అధికారులు దాడులు చేసి రూ.6,500 కోట్లకు పైగా ఆదాయం ఖాతాల్లో చూపలేదని, తద్వారా పన్ను ఎగవేతలకు పాల్పడ్డారని తెలిపింది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని