అన్ని రకాల షేర్లలో..

అగ్రశ్రేణి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఒక నూతన ఫ్లెక్సీ క్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. గత ఏడాదిల్లో లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులకు సంబంధించి సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.

Published : 02 Jul 2021 01:15 IST

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌

అగ్రశ్రేణి మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల్లో ఒకటైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ఒక నూతన ఫ్లెక్సీ క్యాప్‌ పథకాన్ని తీసుకొచ్చింది. గత ఏడాదిల్లో లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడులకు సంబంధించి సెబీ (సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లను ఆవిష్కరించిన విషయం విదితమే. అదే కోవలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన కంపెనీల్లో ఎటువంటి పరిమితులు లేకుండా ఫండ్‌ మేనేజర్‌ విచక్షణ ప్రకారం పెట్టుబడులు పెట్టి, అధిక లాభాలు ఆర్జించేందుకు ప్రయత్నించే అవకాశం ఉండటం ఇటువంటి పథకాల ప్రత్యేకం. అదే సమయంలో అధిక నష్టభయమూ ఉంటుంది. ఏదేని ఒక తరగతికి చెందిన షేర్లలో అధిక ప్రతిఫలం వస్తుందని ఫండ్‌ మేనేజర్‌ అంచనా వేసినప్పుడు... అది జరగకపోతే రిస్కు ఎదురవుతుంది. కానీ, పరిస్థితులను తగ్గట్లుగా పోర్ట్‌ఫోలియోను మార్చుకునే అవకాశం ఉండటం వల్ల సమయానుకూలంగా  వ్యవహరించి లాభాలు గడించే వీలున్నందున ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్ల వైపు మదుపరులు మొగ్గు చూపిస్తున్నారు.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 12న ముగుస్తుంది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో కనీస పెట్టుబడి రూ.5,000. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)లోనూ మదుపు చేయొచ్చు. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ 500టీఆర్‌ఐ సూచీని దీనికి కొలమానంగా తీసుకుంటారు. ఈ పథకానికి రజత్‌ ఛందక్‌, ప్రియాంక ఖండేల్వాల్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. ఫ్లెక్సీ క్యాప్‌ ఫండ్లలో ఇటీవలి కాలంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. యాంఫీ (అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆఫ్‌ ఇండియా) గణాంకాల ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఈ తరహా ఫండ్లలోకి రూ.1,130 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చాయి. అంతకు ముందు నెలలో  రూ.260 కోట్లు మాత్రమే ఉన్న పెట్టుబడులు ఏప్రిల్‌ నెలలో బాగా పెరగడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని