Updated : 08 Oct 2021 02:19 IST

ఆరోగ్య ధీమా పెరిగిందా?

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన రోజులివి. ఆరోగ్య బీమా పాలసీ ఉన్నప్పుడు కొంత మేరకు ఆర్థికంగా భరోసా లభిస్తుంది. అయితే, ఎప్పుడో తీసుకున్న ఆరోగ్య బీమా విలువ.. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా స్వల్పంగా ఉండవచ్చు. కాలానుగుణంగా పాలసీ విలువను పెంచుకున్నప్పుడే కష్టకాలంలో తోడుంటుంది.

రోగ్య రంగంలో ఖర్చులు బాగా పెరిగాయి. ఆసుపత్రి గది, ఔషధాలు, వైద్యుల ఫీజులు, చికిత్స వ్యయాలు అధికం అవుతున్నాయి. వైద్య ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా మీ పాలసీ ఉందా లేదా ఒకసారి పరిశీలించుకోండి. లేకపోతే.. తక్షణమే మీ పాలసీ విలువను పెంచుకునేందుకు ప్రయత్నించండి. మీ బీమా సంస్థను సంప్రదించి, పాలసీ విలువను పెంచుకునేందుకు ఉన్న అవకాశాల గురించి అడగండి.

గతంలో రూ.5లక్షల పాలసీ ఉంటే.. పెద్ద మొత్తం అనుకునే వారు. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో రూ.కోటికి పైగా ఉన్నా.. తక్కువే అనిపిస్తోంది. వీలైనంత వరకూ పాలసీ విలువ ఉండేలా చూసుకోవడం మినహా మరో మార్గం లేదు. పాలసీ ద్వారా కేవలం సాధారణ చికిత్సకే కాకుండా.. అత్యాధునిక వైద్య చికిత్సలకూ అవకాశం కల్పించాలి. అధిక మొత్తంలో పాలసీ ఉన్నప్పుడు నాణ్యమైన చికిత్స లభించే అవకాశం ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడు అవసరాలను సరిగ్గా అంచనా వేసుకోవడం, దాన్ని బట్టి పాలసీని నిర్ణయించుకోవడం మంచిది.

వయసు ఆధారంగా...

చిన్న వయసులో ఉన్నప్పుడు పెద్దగా ఆరోగ్య సమస్యలు ఉండవు. కానీ, వయసు పెరుగుతున్న కొద్దీ.. అనారోగ్యం బారిన పడే అవకాశాలెక్కువే. తక్కువ వయసున్నప్పుడు తీసుకున్న చిన్న పాలసీలు పెద్దవారవుతున్న కొద్దీ సరైన రక్షణ కల్పించలేవు. తీవ్ర వ్యాధులు వచ్చినప్పుడు ఆ చికిత్సలకు సరిపోయే విధంగా పాలసీ ఉండాలి. మీ వయసు ఆధారంగా పాలసీ విలువ పెంచుకునేందుకు ప్రయత్నించాలి. అంతేకాకుండా.. పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే పాలసీలవైపు మొగ్గు చూపాలి.

పునరుద్ధరణ వేళ..

పాలసీని పునరుద్ధరించుకునే సమయంలో.. కవరేజీకి సంబంధించిన మార్పులు చేయాల్సిందిగా బీమా సంస్థను అడగాలి. కాలానుగుణంగా వైద్య అవసరాలు మారుతూ ఉంటాయి. దానికి అనుగుణంగా మీ పాలసీలోనూ మార్పులు రావాలి. కొత్త పాలసీలను తీసుకొచ్చినప్పుడు సాధారణంగా ఇలాంటి మార్పులు ఉంటాయి. వీటిని పాత పాలసీలోనూ అందిస్తారా.. దానికి ఏదైనా అదనంగా ప్రీమియం చెల్లించాలా లాంటి వివరాలు తెలుసుకోవాలి.

కొవిడ్‌-19 నేపథ్యంలో ఆరోగ్య బీమాను నిర్లక్ష్యం చేయడం సరికాదనేది అందరికీ తెలిసింది. జీవన శైలిలోనూ ఎప్పటికప్పుడు మార్పులు వస్తున్నాయి. కాబట్టి, ఎప్పుడూ.. పూర్తిస్థాయిలో రక్షణ కల్పించే పాలసీలనే ఎంచుకోవడం మేలు.

- శ్రీకాంత్‌ కందికొండ, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌, మణిపాల్‌సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని