13 శాతం రాబడి రావాలంటే

ప్రైవేటు ఉద్యోగిని. నెలకు రూ.12 వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. పన్ను మినహాయింపు కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్‌లలో ఏది మంచిది?  

Updated : 18 Feb 2022 03:49 IST

ప్రైవేటు ఉద్యోగిని. నెలకు రూ.12 వేలు పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. పన్ను మినహాయింపు కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌, ఎన్‌పీఎస్‌లలో ఏది మంచిది?

- మోహన్‌

ఈక్విటీ ఆధారిత పెట్టుబడి పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌), జాతీయ పింఛను పథకం (ఎన్‌పీఎస్‌) ఈ రెండు పథకాల ప్రయోజనాలు వేర్వేరుగా ఉంటాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో కనీసం మూడేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాలి. ఎన్‌పీఎస్‌ దీర్ఘకాలిక పథకం. ఈ రెండింటిలో ఎన్‌పీఎస్‌లో ఛార్జీలు తక్కువగా ఉంటాయి. ఈఎల్‌ఎస్‌ఎస్‌లో మదుపు చేసినప్పుడు సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000లోబడి మినహాయింపు లభిస్తుంది. ఎన్‌పీఎస్‌లో మదుపు చేసిన మొత్తం నుంచి రూ.50వేల వరకూ సెక్షన్‌ 80సీసీడీ కింద క్లెయిం చేసుకోవచ్చు. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.12వేలలో రూ.4వేలను ఎన్‌పీఎస్‌కు కేటాయించండి. మిగతా మొత్తాన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌కు మళ్లించండి. మూడేళ్ల తర్వాత వీలును బట్టి, ఈఎల్‌ఎస్‌ఎస్‌లో మూడేళ్లు గడిచిన పెట్టుబడిని వెనక్కి తీసుకొని, మళ్లీ మదుపు చేయొచ్చు. దీనివల్ల పన్ను మినహాయింపు కోసం కొత్తగా మీరు చేతి నుంచి డబ్బు పెట్టాల్సిన అవసరం తప్పుతుంది.


నా జీవిత బీమా పాలసీల నుంచి రూ.3 లక్షల వరకూ వస్తున్నాయి. వీటితో కనీసం నాలుగేళ్ల వరకూ అవసరం లేదు. ఈ మొత్తాన్ని ఇప్పుడు ఎక్కడ మదుపు చేస్తే బాగుంటుంది?

- సంజీవ్‌

నాలుగేళ్ల వ్యవధి ఉందంటున్నారు కాబట్టి, మంచి రాబడి కోసం బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ లేదా హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయొచ్చు. వీటి నుంచి 10-11 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. మీరు రూ.3లక్షలు పెట్టుబడి పెట్టి, నాలుగేళ్లపాటు ఎదురుచూస్తే సగటున 10 శాతం రాబడి అంచనాతో రూ.4,39,230 అయ్యేందుకు వీలుంది.


నేను సింగిల్‌ మదర్‌ని. ఎనిమిదేళ్ల నా పాప పేరుమీద నెలకు రూ.12 వేల వరకూ మదుపు చేయాలని ఆలోచిస్తున్నా. కాస్త మంచి రాబడి వచ్చేలా ఏ పథకాలను ఎంచుకోవాలి?

- శ్రావణి

ముందుగా మీరు మీ పాప భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించే ఏర్పాటు చేయండి. దీనికోసం మీ వార్షిక సంపాదనకు కనీసం 12 రెట్ల వరకూ విలువైన టర్మ్‌ పాలసీని ఎంచుకోండి. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలనూ తీసుకోండి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న రూ.12వేలలో రూ.6వేలను సుకన్య సమృద్ధి యోజనలో జమ చేయండి. మిగతా మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. మీరు పదేళ్లపాటు ఈ పెట్టుబడులను కొనసాగిస్తే.. సగటున 10.5శాతం రాబడితో రూ.23.50లక్షలు చేతికొచ్చే వీలుంది.


నెలకు రూ.20 వేల వరకూ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనతో ఉన్నాను. కనీస వార్షిక రాబడి 13-14 శాతం మించి రావాలంటే ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి? ఎంత కాలం మదుపు కొనసాగించాలి?

- అనిల్‌ కుమార్‌

మీరు ఆశించిన రాబడి రావాలంటే.. ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల్లో మదుపు చేయడమే మార్గం. దీనికోసం మీరు నేరుగా షేర్లను లేదా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవచ్చు. నాలుగు మంచి ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి పెట్టండి. కనీసం 7-10 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగిస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని మర్చిపోవద్దు.


మా అబ్బాయి చదువు కోసం రెండేళ్ల తర్వాత కనీసం రూ.15 లక్షలు అవసరం. ప్రస్తుతం నా దగ్గర రూ.8 లక్షల వరకూ ఉన్నాయి. వీటిని ఎక్కడ మదుపు చేయాలి. నాకు అవసరమైన మొత్తం రావాలంటే నెలకు ఇంకా ఎంత జమ చేయాలి?

- ప్రవీణ్‌

ః మీ దగ్గరున్న రూ.8లక్షలను బ్యాంకు లేదా పోస్టాఫీసులో టైం డిపాజిట్‌ పథకంలో మదుపు చేయండి. 5.5శాతం రాబడితో మీ రూ.8లక్షలు రెండేళ్ల తర్వాత రూ.8,90,420 అవుతాయి. మిగతా మొత్తం సమకూర్చుకునేందుకు నెలకు రూ.25వేల చొప్పున రికరింగ్‌ డిపాజిట్‌ చేసుకోవాల్సి వస్తుంది.


మా తల్లిదండ్రులు ఇద్దరూ సీనియర్‌ సిటిజన్లు. వారి పేరుమీద రూ.5 లక్షలను మదుపు చేసి, నెలనెలా రాబడి వచ్చేలా ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లకు బదులు.. యాన్యుటీ పాలసీ తీసుకుంటే లాభమా?

- శ్రీధర్‌

యాన్యుటీ పాలసీల్లో ఇప్పుడు 5.5 శాతం వరకూ వడ్డీ చెల్లిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక పథకం. ఒకసారి వడ్డీ నిర్ణయించాక అదే కొనసాగుతుంది. భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగితే నష్టపోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపైనా తక్కువ వడ్డీ లభిస్తోంది. వీటికి బదులుగా మీరు పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ స్కీంను పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఇందులో 7.4శాతం వడ్డీ వస్తోంది. అయిదేళ్లపాటు పెట్టుబడిని కొనసాగించాలి.


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని