స్కోరుంటే... తగ్గేను వడ్డీ భారం

రుణాలపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంకులు వడ్డీ రేటును క్రెడిట్‌ స్కోరుకు అనుసంధానిస్తున్నాయి. అధిక క్రెడిట్‌ స్కోరున్న వారికి వడ్డీ రేట్లలో 5-10 బేసిస్‌ పాయింట్ల వరకూ రాయితీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణం తీసుకోవాలనుకునే వారు తమ క్రెడిట్‌ స్కోరు ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

Published : 27 May 2022 01:02 IST

రుణాలపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఇదే సమయంలో బ్యాంకులు వడ్డీ రేటును క్రెడిట్‌ స్కోరుకు అనుసంధానిస్తున్నాయి. అధిక క్రెడిట్‌ స్కోరున్న వారికి వడ్డీ రేట్లలో 5-10 బేసిస్‌ పాయింట్ల వరకూ రాయితీ ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో రుణం తీసుకోవాలనుకునే వారు తమ క్రెడిట్‌ స్కోరు ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

క్రెడిట్‌ స్కోరు.. ఒక వ్యక్తి రుణ అర్హతను నిర్ణయించడంలో ప్రధానమైన సంఖ్య. ఏదైనా రుణం లేదా క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేయగానే ముందుగా బ్యాంకులు/బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు ఆ వ్యక్తి క్రెడిట్‌ స్కోరు, రుణ వాయిదాల చెల్లింపుల చరిత్ర ఎలా ఉంది అని పరిశీలిస్తాయి. 750కి మించి క్రెడిట్‌ స్కోరున్నప్పుడే.. నమ్మకమైన రుణ గ్రహీతగా భావిస్తాయి.

తీసుకున్న రుణాలకు ఒక్క ఈఎంఐని ఆలస్యంగా చెల్లిస్తే చాలు.. క్రెడిట్‌ స్కోరు తగ్గిపోతుంది. దీన్ని తిరిగి పూర్వ స్థితికి తెచ్చుకోవడానికి అధిక సమయమే పడుతుంది.

గృహ, వాహన, వ్యక్తిగత రుణాలు, క్రెడిట్‌ కార్డు బిల్లులు.. ఇలా ఏదైనా సరే.. సకాలంలో చెల్లించారా లేదా అనేదే క్రెడిట్‌ స్కోరు గణనలో కీలకమైన అంశం. అదే సమయంలో క్రెడిట్‌ కార్డును ఉపయోగిస్తున్నప్పుడు పరిమితిని అధికంగా వినియోగించినప్పుడూ స్కోరుపై ప్రభావం పడుతుంది. కార్డు రూ.50వేల పరిమితితో ఉంటే.. దీనిని రూ.20వేలకు మించి వాడకూడదు. అప్పుడే క్రెడిట్‌ పరిమితిని క్రమశిక్షణతో వాడుతున్నట్లు బ్యాంకులు భావిస్తాయి. ఆఫర్‌లు, నగదు వెనక్కి తదితరాల కోసం క్రెడిట్‌ కార్డు పూర్తి మొత్తాన్ని వినియోగించడం ఎప్పుడూ మంచిది కాదు. దీనివల్ల ఆ వ్యక్తి ఎక్కువగా అప్పులపైనే ఆధారపడుతున్నారని బ్యాంకులు అనుకుంటాయి. క్రెడిట్‌ స్కోరుపైనా ప్రతికూల ప్రభావం ఉంటుంది.

అనవసరంగా అడగొద్దు..

రుణం కావాలా.. క్రెడిట్‌ కార్డు తీసుకుంటారా అని తరచూ ఫోన్లు వస్తూనే ఉంటాయి. కొన్నిసార్లు మనకు అవసరముండే బ్యాంకులను సంప్రదిస్తుంటాం. రుణం ఇస్తామని ఫోన్‌ రాగానే వెంటనే సరే అని అనకూడదు. వారు అడిగిన వివరాలు ఇవ్వడం వల్ల మీరు అప్పు కోసం బ్యాంకును సంప్రదించారని రికార్డుల్లోకి వెళ్తుంది. క్రెడిట్‌ బ్యూరో సంస్థలు ఈ విషయాన్ని నమోదు చేస్తాయి. దీనివల్ల క్రెడిట్‌ స్కోరు తగ్గే ఆస్కారం ఉంది. కాబట్టి, అత్యవసర పరిస్థితులు ఉంటేనే రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. క్రెడిట్‌ కార్డుకూ ఇదే నిబంధన వర్తిస్తుంది.

హామీ ఉన్న రుణాలతో..

మంచి క్రెడిట్‌ స్కోరును సంపాదించడంలో తీసుకున్న రుణాలూ కీలకమే. హామీ ఉండే గృహ, వాహన రుణం తీసుకొని, వాటికి క్రమంగా చెల్లిస్తూ ఉంటే స్కోరులో వృద్ధి కనిపిస్తుంది. హామీ లేని వ్యక్తిగత, క్రెడిట్‌ కార్డు రుణాలను అధికంగా తీసుకుంటే సహజంగానే రుణ చరిత్రపై ప్రభావం ఉంటుంది. ఈ రెండు రకాల రుణాల మిశ్రమం ఉన్నప్పుడు స్కోరులో స్థిరత్వం కనిపిస్తుంది.

తేడాలుంటే..

కనీసం ఆరు నెలలకోసారి క్రెడిట్‌ నివేదికను పరిశీలించాలి. కొన్ని సంస్థలు ప్రాథమిక క్రెడిట్‌ నివేదికను ఉచితంగానే అందిస్తున్నాయి. బ్యాంకులూమొబైల్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ ఖాతాలోనూ క్రెడిట్‌ స్కోరును అందిస్తున్నాయి. క్రెడిట్‌ నివేదికను పరిశీలించినప్పుడు తేడాలున్నట్లు గుర్తిస్తే వెంటనే ఆ విషయాన్ని బ్యాంకు, క్రెడిట్‌ బ్యూరోల దృష్టికి తీసుకెళ్లాలి. నిపుణుల సహాయంతో దీనిని సరిచేసుకోవచ్చు. వెంటనే తెలియజేయకపోతే.. భవిష్యత్తులో చిక్కులు వచ్చే ఆస్కారం ఉంది.
క్రెడిట్‌ స్కోరు మీ ఆర్థిక క్రమశిక్షణకు గుర్తు. అవసరమైనప్పుడు అడిగినంత రుణం, వడ్డీ రేట్లలో బేరం ఆడే శక్తిని ఇది అందిస్తుంది. కాబట్టి, దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని