Sundar Pichai: స్థానిక చట్టాలను గౌరవిస్తాం

దేశమేదైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్‌ కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా అవలంబించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని

Published : 27 May 2021 13:06 IST

వాషింగ్టన్‌: దేశమేదైనా అక్కడి స్థానిక చట్టాలకు గూగుల్‌ కట్టుబడి ఉంటుందని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతకు అనుగుణంగా అవలంబించే రెగ్యులేటరీ విధానాల్లో ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తుందని ఆ సంస్థ సీఈవో సుందర్‌ పిచాయ్‌ తెలిపారు. భారత్‌లో బుధవారం నుంచి కొత్త ఐటీ నియమ నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై పిచాయ్‌ తాజాగా స్పందించారు. 

‘‘మేం కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి దేశంలో అక్కడి స్థానిక చట్టాలను పూర్తిగా గౌరవిస్తాం. నిర్మాణాత్మకగా పనిచేస్తాం. మా నివేదికలన్నీ పారదర్శకంగా ఉంటాయి. ప్రభుత్వ అభ్యర్థనలకు అనుగుణంగా చేసే మార్పులను కూడా ఆ నివేదికల్లో పొందుపరుస్తాం. స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌.. భారత్‌లో సుదీర్ఘంగా ఉన్న సంప్రదాయం. ఒక కంపెనీగా.. ఆ స్వేచ్ఛాయుత ఇంటర్నెట్‌ విలువలు, వాటి ప్రయోజనాల గురించి మాకు తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఏ నియంత్రణ సంస్థలతోనైనా మేం కలిసి పనిచేస్తాం. సంపూర్ణ సహకారం అందిస్తాం. న్యాయపరమైన ప్రక్రియలు, విధానాలపై మాకు గౌరవం ఉంది. అందువల్ల ప్రభుత్వాలు అవలంబించే రెగ్యులేటరీ విధానాలకు మేం పూర్తిగా కట్టుబడి ఉంటాం. అది యూరప్‌లోని కాపీరైట్‌ ఆదేశాలైనా.. భారత్‌లోని డిజిటల్ కంటెట్‌ నియంత్రణ చర్యలైనా.. వాటిని మేం ఒకేలా చూస్తాం. వాటిని ఎలా పాటించాలన్న దాని గురించి పరిశీలిస్తాం’’అని ఆసియా ఫసిఫిక్‌ రిపోర్టర్లతో జరిగిన వర్చువల్‌ సమావేశంలో సుందర్‌ పిచాయ్‌ చెప్పుకొచ్చారు.

వివిధ సామాజిక మాధ్యమాల్లో డిజిటల్‌ కంటెంట్‌పై నియంత్రణకు.. కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో కొత్త ఐటీ నిబంధనలు ప్రకటించిన విషయం తెలిసిందే. అవి తక్షణమే అమల్లోకి రాగా.. దిగ్గజ సామాజిక వేదికలకు మాత్రం 3 నెలల వెసులుబాటు కల్పించింది. ఆ గడువు ముగియడంతో బుధవారం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అయితే, వీటిని నిలిపివేయాలని మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ కోర్టుకు వెళ్లడం వివాదాస్పదంగా మారింది. గూగుల్‌ మాత్రం ఈ నిబంధనలను పాటిస్తామని ఇప్పటికే పరోక్షంగా ప్రకటించింది. మా కంపెనీ ఉత్పత్తుల్లో మార్పులు తెస్తున్నాం. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను అడ్డుకోవటానికి... ఆయా దేశాల చట్టాలను అనుసరిస్తూ.. వనరులను, సిబ్బందిని సమర్థంగా వినియోగిస్తున్నాం’’ అని పేర్కొంది. 

కాగా.. ఈ నిబంధనల వల్ల యూజర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందంటూ వాట్సాప్‌ కోర్టును ఆశ్రయించింది. దీంతో కేంద్రం, వాట్సాప్‌ మధ్య వివాదం రాజుకుంది. అయితే, కొత్త నిబంధనల అమలుకు కసరత్తు చేస్తున్నామని తమ యాజమాన్య సంస్థ ఫేస్‌బుక్‌ చెప్పిన తర్వాత కూకడా వాట్సప్‌ ఈ వాదన చేయడం గమనార్హం. మరోవైపు ఈ ఆరోపణలపై కేంద్రం దీటుగా స్పందించింది. దేశ సార్వభౌమత్వం, శాంతిభద్రతలకు సంబంధించిన తీవ్రమైన అంశాల్లో ప్రభుత్వం యూజర్ల వ్యక్తిగత సమాచారం కోరుతుందని తేల్చి చెప్పింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని