Ukraine Crisis: మార్కెట్లో కొన్ని వారాలు తీవ్ర హెచ్చుతగ్గులే

నిప్టీ-50 సూచీ కొన్ని నెలలుగా అధిక ఊగిసలాటకు గురవుతోంది. ఫిబ్రవరి ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ 10 నెలల గరిష్ఠమైన 1.45 శాతం (రోజు వారీ గరిష్ఠ, కనిష్ఠాలకు మధ్య సగటు అంతరం) మేర హెచ్చుతగ్గులకు

Updated : 25 Feb 2022 08:36 IST

మార్చి ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌పైనా ప్రభావం

నిప్టీ-50 సూచీ కొన్ని నెలలుగా అధిక ఊగిసలాటకు గురవుతోంది. ఫిబ్రవరి ఎఫ్‌ అండ్‌ ఓ సిరీస్‌ 10 నెలల గరిష్ఠమైన 1.45 శాతం (రోజు వారీ గరిష్ఠ, కనిష్ఠాలకు మధ్య సగటు అంతరం) మేర హెచ్చుతగ్గులకు లోను కావడమే ఇందుకు ఉదాహరణ. 2021 ఏప్రిల్‌ సిరీస్‌లో సగటున 1.55 శాతం; అంతకు ముందు మార్చి సిరీస్‌లో 1.77 శాతం మేర ఈ సూచీ ఊగిసలాడింది. గత 12 నెలల సగటు తీసుకుంటే 1.19 శాతంగా ఉంది. 2021 జులైలో మాత్రమే అతి తక్కువ(0.77%) ఊగిసలాట చోటు చేసుకుంది. ఫిబ్రవరి సిరీస్‌ సమయంలో నిఫ్టీ 3.5 శాతం మేర నష్టాల పాలైంది. 2022 మార్చి సిరీస్‌లోనూ ఈ ఊగిసలాట తప్పకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే కొన్ని వారాల పాటూ ఇదే ధోరణి ఉండొచ్చని చెబుతున్నారు. అందుకు కారణాలను విశ్లేషిస్తున్నారు. అవేంటంటే..

* రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం ముఖ్య కారణంగా ఉండబోతోంది. రష్యాతో మన వ్యాపారాలను ప్రభావితం చేసే ఆంక్షలపై; ఐరోపా దేశాలపై ఈ సంక్షోభం ఎంత ప్రభావం చూపుతుందనే అంశాలను మదుపర్లు గమనిస్తారు. ఒక వేళ రష్యా శాంతి మంత్రం పఠిస్తే  అంతర్జాతీయంగా అన్ని మార్కెట్లూ లాభాల్లోకి వెళతాయి.

* మార్చి 15-16న జరిగే యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశంలో వడ్డీ రేట్ల పెంపుపై తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి. 0.25% పెంపు ఉండొచ్చనే అంచనాను మార్కెట్లు జీర్ణించుకున్నాయి. ఒక వేళ రేట్ల పెంపు అంతకు మించితే మార్కెట్లు వేరేలా స్పందించొచ్చు.

* గురువారం బ్రెంట్‌ చమురు ధర 105 డాలర్లను అధిగమించింది. ధరలు ఇలాగే కొనసాగితే కొన్ని రంగాల్లోని కంపెనీల ఫలితాలపై ప్రభావం కనిపించొచ్చు. 

* ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెలువడతాయి. పంజాబ్‌, మణిపూర్‌ వంటి భాజపాయేతర రాష్ట్రాల్లో భాజపాకు సానుకూలంగా ఫలితాలు వస్తే సెంటిమెంటు మెరుగుపడొచ్చు.

* అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో కొద్ది నెలలుగా విదేశీ సంస్థాగత మదుపర్లు(ఎఫ్‌ఐఐలు) నికర విక్రేతలుగా ఉన్నారు. మార్చిలో వారి విక్రయాలు మరింత పెరిగితే పెద్ద షేర్లు, సూచీలకు ఇబ్బందే. నికర కొనుగోలుదార్లుగా ఉన్న డీఐఐ, రిటైల్‌ మదుపర్లు కూడా సంవత్సరాంతంలో లాభాల స్వీకరణకు దిగొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని