మదుపు బాటలో...బఫెట్ పాఠాలు

ఆయన అనుసరించిన వ్యూహాలలో కొన్నైనా పాటిస్తే మీరూ ఒక విజయవంతమైన మదుపరిగా మారేందుకు వీలుంది....

Published : 19 Dec 2020 10:46 IST

ఆయన అనుసరించిన వ్యూహాలలో కొన్నైనా పాటిస్తే మీరూ ఒక విజయవంతమైన మదుపరిగా మారేందుకు వీలుంది.

వారెన్ బఫెట్…ప్రపంచం లోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు…స్టాక్ మార్కెట్ లో మదుపు చేసే వారందరికీ ఆదర్శం. మరి…విజయవంతమైన పెట్టుబడిదారుడిగా మారేందుకు ఆయన అనుసరించిన వ్యూహాలేమిటి? పాటించిన సూత్రాలేమిటి? మనమూ తెలుసుకుందామా! స్టాక్ మార్కెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం అసాధ్యం. కానీ, ఆ ఆటుపోట్లలోనే అంతులేని సంపద దాగి ఉందని, ఎటొచ్చీ దాన్ని అందుకునేందుకు కిటుకులు తెలుస్తే చాలని నిరూపించిన వ్యక్తి వారెన్ బఫెట్. ఆయన ప్రతి మాటా పెట్టుబడిదారులకు ఓ మార్గనిర్దేశం. ఆయన అనుసరించిన వ్యూహాలేమిటో తెలుసుకుని…అందులో కొన్నైనా పాటిస్తే మీరూ ఒక విజయవంతమైన మదుపరిగా మారేందుకు వీలుంది.

  • బఫెట్ ప్రతి పెట్టుబడినీ ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తాడు. ఆయన పాటించే ప్రధాన సూత్రాలు రెండు. ఒకటి పెట్టుబడిని నష్టపోకూడదు. రెండు…మొదటి సూత్రాన్ని మర్చిపోకూడదు. ఈ రెండు నియమాలు తాను ఈ స్థాయి లో ఉండడానికి కారణమని ఎప్పుడూ చెబుతుంటారు.

  • తనకి అవగాహనా లేని వ్యాపారాల జోలికి వారెన్ బఫెట్ వెళ్ళడు. కొందరికి కొన్ని రంగాల పై అవగాహన ఉంటే మరికొందరికి ఇంకొన్నింటి పై ఉంటుంది. ఆయా రంగాల్లో వారికి అన్ని విషయాలనూ విశ్లేషించే సామర్ధ్యం ఉంటుంది. పెట్టుబడి కోసం అలా మీకు అవగాహన ఉన్న రంగాలనే ఎంచుకోవాలి. అప్పుడు మీ పెట్టుబడిని కాపాడుకోవడం ఎలాగో మీకు తెలుస్తుంది.

  • పోటీతత్వం లో కూడా ప్రత్యేక శక్తిసామర్ధ్యాలతో మెరుగైన పని తీరును ప్రదర్శించే కంపెనీలు త్వరగా వృద్ధి చెందుతుంటాయి. అలాంటి కంపెనీలు పెట్టుబడికి రక్షణ ఇవ్వడం తో పాటు వృద్ధికీ వీలు కల్పిస్తాయి. తక్కువ ఖర్చుతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగే కంపెనీలు లేదా విశ్వవ్యాప్త గుర్తింపు ఉన్న బ్రాండ్ల కంపెనీలను గుర్తించగలగాలి. అలాంటి కంపెనీల్లో పెట్టుబడులు మంచి వృద్ధి ని సాధిస్తాయి.

  • మంచి ఫలితాలను సాధించే కంపెనీల షేర్లు అనుకోకుండా కొన్ని సందర్భాల్లో అందుబాటు ధరల్లో దొరికేందుకు వీలుంటుంది. ఇలాంటప్పుడు వాటిని ఎంత మాత్రం వదులుకోకూడదు.

  • ఒక కంపెనీ కొనాలంటే ఎలా ఆలోచిస్తారో…ఒక కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టాలన్నా అలాగే ఆలోచించాలి. ఒకసారి మీరు వ్యాపారాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే…అప్పుడు ఆ కంపెనీ నాణ్యత మీద మీరే ఒక నిర్ణయానికి రాగలుగుతారు. బఫెట్ విజయసూత్రాల్లో నాణ్యమైన కంపెనీ షేర్లను తక్కువ ధరకు కొనడం కూడా ఒకటి.

  • అద్భుతమైన కంపెనీ షేర్లను సమంజసమైన ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. కానీ, అంతగా పని తీరు కనబర్చని కంపెనీ షేర్ ను మంచి ధర వద్ద కాదు.

  • మార్కెట్ ను అంచనా వేయడం మానేయండి. ఆర్ధిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ఎలక్షన్లు మార్కెట్ పై చూపే ప్రభావం గురించి ఆలోచించకండి. కంపెనీ కి సంబంధించిన ఆర్ధిక విషయాల్ని, దాని భవిష్యత్తు అంచనాల్ని, విలువను విశ్లేషించుకోండి. అన్నీ మీకు అనుకూలంగా ఉంటేనే ఆ షేర్లను కొనండి.

  • నష్టభయాన్ని తగ్గించుకునేందుకు వీలుగా పెట్టుబడిని 5-10 కంపెనీల షేర్లకే పరిమితం చేయాలి. దాని వల్ల ఆయా కంపెనీల గురించి మరింత పరిశోధన చేయడానికి వీలుంటుంది. చాలా మంది ఆర్ధిక నిపుణులు పెట్టుబడిని వైవిధ్యంగా ఉండేలా చూసుకోవాలని, దాని వల్ల నష్టభయం తగ్గుతుందని చెబుతుంటారు. కానీ, బఫెట్ మాత్రం ఇంకా భిన్నంగా మదుపు చేస్తాడు. ఒక కంపెనీ ని ఆయన ఇష్టపడితే…దానిలో పెద్ద మొత్తం లో పెట్టుబడి పెడతాడు. ఆయన నమ్మకం ఏంటంటే…కంపెనీ ని పూర్తిగా అర్ధం చేసుకుంటే ఆశించిన స్థాయి లో రాబడి వస్తుందని. మదుపర్లు కూడా ఈ విషయాన్నీ గమనించాలి. మంచి అవకాశం కోసం ఎదురు చూసి సరైన షేరు ను కొనుగోలు చేయడం వల్ల నష్టభయం తగ్గడమే కాకుండా…మంచి రాబడికి కూడా అవకాశం ఉంటుంది.

  • మీరు చెల్లించేది ధర…మీకు వచ్చేది విలువ అనేది గుర్తుంచుకోవాలి.

  • ఆకర్షణీయమైన ధరల వద్ద ఉన్నప్పుడు ఆ షేరు లో పెట్టుబడి పెట్టడం కీలకం. కంపెనీ విలువ కన్నా షేరు ధర తక్కువగా ఉన్నప్పుడు…పెట్టుబడికి రక్షణ ఉంటుందని భావించినప్పుడు మాత్రమే ఆ షారును బఫెట్ కొనుగోలు చేస్తాడు. ఏ మాత్రం నష్టభయం లేని, లేదా చాలా తక్కువగా ఉండే పెట్టుబడి గురించీ ఎక్కువగా ఆలోచించాలి.

  • మీరు పెట్టుబడి దారుడు అయితే…కంపెనీ లో ఏం జరుగుతుంది అన్న దాని పైనే దృష్టి పెట్టండి. స్పెకులేటర్ అయితే…కంపెనీ షేరు ధర ఎలా ఉండబోతోంది అన్నది చూడండి.

  • బఫెట్ దృష్టి లో విజయవంతమైన పెట్టుబడిదారుడు ఎవరంటే…మిగతా వారందరూ మార్కెట్ లో పాల్గొంటున్నప్పుడు కొంచెం భయంగా ఉండే వారు, అందరూ భయం తో దూరమవుతున్నప్పుడు ఉత్సాహంగా ముందుకెళ్లే వారు. ఎక్కువ మంది ఆసక్తి తో ఉన్న షేరు గురించే అందరూ ఆలోచిస్తారు. ఒకేసారి ఆ షేరు మీద అందరికీ అయిష్టం ఏర్పడిందనుకోండి…నష్టాలపాలవుతారు!

  • వారెన్ బఫర్ నమ్మే సిద్ధాంతాల్లో మరో ముఖ్యమైనది ఏంటంటే…సరైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటూ…ఎప్పుడైతే తప్పుడు నిర్ణయాలను తగ్గించుకుంటారో, అప్పుడే సంపద సృష్టి సాకారమవుతుందని.

పైన చెప్పిన కీలక పెట్టుబడి సూత్రాలతో పాటు అతని వ్యక్తిగత క్రమశిక్షణ, ధైర్యం, స్థైర్యం, నమ్మకం, ఓపిక తదితర లక్షణాలతో ఒక విజయవంతమైన, పరిపూర్ణమైన పెట్టుబడిదారుడిగా బఫెట్ ఎదిగారు. ఆయన పెట్టుబడి ప్రక్రియను ఆదర్శంగా తీసుకుని మదుపర్లు వారి రాబడిని మరింత పెంచుకోగలగాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని