మహామాంద్యం తర్వాత..ఇదే అత్యంత తీవ్ర సంక్షోభం!

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల గత సంవత్సరం కోల్పోయిన ఉద్యోగాలు, 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటితో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువని ఐక్యరాజ్య సమితి ని

Updated : 25 Jan 2021 22:36 IST

ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడి

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల గత సంవత్సరం కోల్పోయిన ఉద్యోగాలు, 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటితో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. కరోనా విజృంభణ నేపథ్యంలో వాణిజ్యం, ప్రజలపై విధించిన ఆంక్షలతో దాదాపు ప్రపంచవ్యాప్తంగా 8.8శాతం పనిగంటలు నష్టపోయినట్లు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌ఓ) తెలిపింది. ఇది 25కోట్ల మంది పూర్తిస్థాయి ఉద్యోగులతో సమానమని ఐఎల్‌ఓ పేర్కొంది. దీంతో దశాబ్దం క్రితం ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావానికన్నా నాలుగు రెట్లు ఎక్కువని ఐక్యరాజ్యసమితి కార్మిక విభాగం అంచనా వేసింది.

‘1930నాటి మహామాంద్యం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైన సంక్షోభం. దీని ప్రభావం 2009 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ’ అని అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ గయ్‌ రైడర్‌ పేర్కొన్నారు. పనిగంటల నష్టం, ఊహించని స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవడంపై దీని ప్రభావం సమానంగా చూపించినట్లు తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఎక్కువగా రెస్టారెంట్లు, స్టోర్లు, హోటళ్ల వంటి ఇతర సర్వీసుల్లో పనిచేసే వారేనని తెలిపారు. ఇక పని గంటలు తగ్గడం వల్ల కలిగిన నష్టం దాదాపు 3.7లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని ఐఎల్‌ఓ అంచనా వేసింది. ఈ నష్టం ఎంతో అసాధారణమైందని, ముఖ్యంగా వీటి ప్రభావం మహిళలు, యువతపై ఎక్కువగా పడినట్లు ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గయ్‌ రైడర్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ సంవత్సరం రెండో వార్షికం నుంచి ఉద్యోగాల్లో కొంత పురోగతి కనిపించే అవకాశం ఉంటుందని ఐఎల్‌ఓ నివేదిక అంచనా వేసింది. అయితే, ఇది కరోనా వైరస్‌ కేసులు, వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంపైనే ఆధారపడి ఉంటుందని తెలిపింది. కొన్ని దేశాల్లో వైరస్‌ వ్యాప్తి పెరగడం, మరికొన్ని దేశాల్లో అదే రీతిలో వ్యాప్తి చెందడంతోపాటు వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగుతున్న విషయాలను ఐఎల్‌ఓ పరిగణలోకి తీసుకుంది.

ఇవీ చదవండి..
కరోనా కష్టాలు పేదలకే..!
అమెరికాలో 4లక్షలకు చేరిన కొవిడ్‌ మరణాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని