బ‌డ్జెట్ అర్థంకావాలంటే...

బ‌డ్జెట్ నివేదిక‌లో కొన్ని కీల‌క ప‌దాల గురించి తెలుసుకోవ‌డం ద్వారా అవ‌గాహ‌న సులభం అవుతుంది. ఆ ప‌దాలేంటో ఇప్పుడు చూద్దాం...

Published : 16 Dec 2020 14:59 IST

బ‌డ్జెట్ నివేదిక‌లో కొన్ని కీల‌క ప‌దాల గురించి తెలుసుకోవ‌డం ద్వారా అవ‌గాహ‌న సులభం అవుతుంది. ఆ ప‌దాలేంటో ఇప్పుడు చూద్దాం.

రెవెన్యూ బ‌డ్జెట్ (రాబ‌డి ఖాతా సంబంధిత లెక్క‌లు), క్యాపిట‌ల్ బ‌డ్జెట్ (మూల‌ధ‌న ఖాతా సంబంధిత‌ లెక్క‌లు) ఈ రెండింటి ద్వారా జ‌రిగే రాబ‌డి వ్య‌యాల‌ను ఖ‌ర్చులు, ర‌శీదులుగా గుర్తించి గ‌ణిస్తారు. వీటిని అర్థం చేసుకోవాలంటే ముందు ర‌శీదులు, ఖ‌ర్చుల గురించి తెలుసుకోవాలి.

ఆదాయ (రెవెన్యూ) ఖాతా :

ఈ ఖాతా రెవెన్యూ ఆదాయం, రెవెన్యూ ఖ‌ర్చుల‌కు సంబంధించిన లెక్క‌లు క‌లిగి ఉంటుంది. దీంట్లో ప్ర‌ధానంగా ప‌న్ను ఆదాయం, ప‌న్నేత‌ర ఆదాయం, గ్రాంట్స్ ఇన్ ఎయిడ్, కాంట్రిబ్యూష‌న్లు ఉంటాయి.

ఆదాయ (రెవెన్యూ) ర‌శీదులు:

ప్ర‌భుత్వం చేసే రోజు వారీ కార్య‌క‌లాపాల ద్వారా ల‌భించే నిధలను రెవెన్యూ రాబ‌డిగా చెప్ప‌వ‌చ్చు. ప‌న్నుల ద్వారా ల‌భించే ఆదాయాన్ని ప్ర‌ధాన‌మైన రెవెన్యూ ర‌శీదులుగా చెప్పొచ్చు.

ఆదాయ (రెవెన్యూ )ఖ‌ర్చులు:

ఏవైనా ఆస్తుల క్ర‌య‌విక్ర‌యాల‌కుసంబంధం లేని ఇత‌ర‌ ఖ‌ర్చుల‌ను రెవెన్యూ ఖ‌ర్చులు కింద ప‌రిగ‌ణిస్తారు. ఉద్యోగుల‌కు ప్ర‌భుత్వం చెల్లించే జీతాలు, స‌బ్సిడీలు, వ‌డ్డీ చెల్లింపులు రెవెన్యూ ఖ‌ర్చుల‌కు ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌వ‌చ్చు.

మూల‌ధ‌న (క్యాపిట‌ల్) ఖాతా:

ఈ ఖాతా మూల‌ధ‌న ఆదాయం, మూల‌ధ‌న‌ ఖ‌ర్చులకు సంబంధించిన లెక్క‌లు క‌లిగి ఉంటుంది. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వం రుణాలు ఇవ్వ‌డం లేదా తీసుకోవ‌డం, ఆస్తుల క్ర‌య‌విక్ర‌యాల ద్వారా వ‌చ్చే నిధులు ఉంటాయి.

మూల‌ధ‌న‌ (క్యాపిట‌ల్ ) ర‌శీదులు:

ప్ర‌భుత్వం ఆస్తులను విక్ర‌యించ‌డం ద్వారా వ‌చ్చే నిధుల‌ను లేదా ఆస్తుల‌ను కొనుగోలు ద్వారా ఖ‌ర్చుచేసే నిధులు ఈ మూల ధ‌న ఖాతాలోకి వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు ప్ర‌భుత్వం చేప‌ట్టే పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చెప్ప‌వ‌చ్చు. ప్ర‌భుత్వం త‌న వాటాల‌ను విక్ర‌యించ‌గా వ‌చ్చే నిధుల‌ను ఈఖాతా లోకి చేరుస్తారు.

మూల‌ధ‌న‌ (క్యాపిట‌ల్ )ఖ‌ర్చులు:

ప్ర‌భుత్వం కొన్ని సంద‌ర్భాల్లో రుణాల కింద నిధులు జారీ చేసిన‌పుడు వెచ్చించే నిధులు ఈ ఖాతా లోకి వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు లేదా సంస్థ‌ల‌కు ఇచ్చే రుణాల‌ను మూల‌ధ‌న‌ ఖ‌ర్చులఖాతా లోకి వ‌స్తాయి.

ఆదాయ ( రెవెన్యూ) లోటు:

ప్ర‌భుత్వానికి వ‌చ్చిన ఆదాయం కంటే ఎక్కువ ఖ‌ర్చులు అయ్యే ప‌రిస్థితి మూలంగా లోటు ఏర్ప‌డుతుంది. దీనినే రెవెన్యూ లోటు అంటారు.రెవెన్యూ ఖాతాలో వ‌చ్చే ఆదాయంతో స‌మానంగా ఖ‌ర్చులు ఉంటే రెవెన్యూ లోటు ఏమీ ఉండ‌దు. అదే ఖ‌ర్చుల కంటే ఆదాయం ఎక్కువ ఉంటే రెవెన్యూ మిగులు ఉంటుంది.

ఆర్థిక (ఫిస్క‌ల్) లోటు:

ద్ర‌వ్య లోటు లెక్కించేందుకు మొత్తం ఆదాయం నుంచి మొత్తం ఖ‌ర్చులు, మార్కెట్ రుణాల‌ను తీసివేయగా వ‌చ్చిన మొత్తంను ద్ర‌వ్య‌లోటు అంటారు. ప్ర‌భుత్వం ఇంకా ఎంత మేర‌కు రుణం తీసుకోవాల‌నే విష‌యం తెలుస్తుంది.

ప‌న్నేత‌ర ఆదాయం:

ప్ర‌ధానంగా ఈ విభాగంలోకి వ‌చ్చేది వ‌డ్డీ ఆదాయం. ప్ర‌భుత్వం ఏవైనా రుణాల‌ను ఇచ్చిన‌ట్ట‌యితే వాటిపై వ‌చ్చే వ‌డ్డీ ఆదాయం, డివిడెండ్లు, లాభాల రూపంలో ప్ర‌భుత్వ రంగ కంపెనీల నుంచి ల‌భించిన నిధులు ఇందులో ఉంటాయి. ప్ర‌భుత్వం భాగ‌స్వామ్యంగా ప‌లు సంస్థ‌ల నుంచి వ‌చ్చే ఆదాయం ప్ర‌భుత్వం పొందుతుంది.

ప్ర‌త్య‌క్ష ప‌న్నులు :

సాధారణంగా ప‌న్ను చెల్లింపు నేరుగా వ్య‌క్తుల‌పై ఉంటే దాన్ని ప్ర‌త్య‌క్ష ప‌న్నులు అంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఆదాయ ప‌న్ను,(వ్య‌క్తుల‌కు, కార్పోరేట్ సంస్థ‌ల‌కు) సెక్యురిటీ ట్రాన్సాక్ష‌న్ ప‌న్ను మొద‌లైన‌వి.

ప‌రోక్ష ప‌న్నులు :

ప‌న్ను చెల్లింపు నేరుగా వ్య‌క్తుల‌పై ప‌డ‌కుండా ఉండే వాటిని ప‌రోక్ష ప‌న్నులు అంటారు. ఎక్సైజ్ సుంకం, స‌ర్వీస్ సుంకం మొద‌లైన‌వి ప‌రోక్ష ప‌న్నుల కింద‌కు వ‌స్తాయి. ప‌రోక్ష ప‌న్నులు దేశంలో అన్ని వ‌ర్గాల‌పై ఒకే విధంగా ప్ర‌భావం చూపుతాయి. ధ‌నిక,పేద తేడా లేకుండా చెల్లించాల్సిన ప‌రిస్థితి ప‌రోక్ష ప‌న్ను ద్వారా ఏర్ప‌డుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని