Luxury Cars: భారత్‌లో లగ్జరీ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌!

మెర్సిడెజ్‌ బెంజ్‌, ఆడి, బీఎండబ్ల్యూ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న విలావంతమైన కార్లకు డిమాండ్‌ పెరుగుతోందని ఆయా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు....

Published : 24 Apr 2022 17:15 IST

దిల్లీ: మెర్సిడెజ్‌ బెంజ్‌, ఆడి, బీఎండబ్ల్యూ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న విలావంతమైన కార్లకు డిమాండ్‌ భారీగా పెరుగుతోందని ఆయా సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. ఫలితంగా వాటిని బుక్‌ చేసుకున్నవారు డెలివరీ కోసం చాలాకాలం వేచి చూడాల్సి వస్తోందన్నారు.

‘‘రూ.70-75 లక్షలు ఆపై విలువ చేసే కార్లకు గత ఏడాది కాలంగా డిమాండ్ భారీగా పెరిగింది. వీటిని కొనే సామర్థ్యం ఉన్నవారు విలాసవంతమైన కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. అందుబాటు ధరలో ఉండే కార్ల కంటే వీటి విక్రయాల్లోనే వృద్ధి ఎక్కువగా ఉంది. రూ.కోటికి పైగా ధర పలుకుతున్న ఆడి ఈ-ట్రాన్‌ భారత్‌కు రాకముందే విక్రయమైపోతున్నాయి. ఒకప్పుడు వీటి కోసం గరిష్ఠంగా రెండు నెలలు వేచి చూసేవారు. ఇప్పుడు ఆరు నెలల వరకు ఆగాల్సి వస్తోంది’’ అని ఆడి ఇండియా అధినేత దల్బీర్‌ సింగ్‌ ధిల్లాన్ తెలిపారు.

మెర్సిడెజ్‌ బెంజ్‌ ఇండియా ఎండీ, సీఈఓ మార్టిన్‌ శ్వెంక్‌ సైతం ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. తమ సంస్థ నుంచి వస్తోన్న జీఎల్‌ఎస్‌, జీఎల్‌ఈ వంటి కార్ల కోసం కస్టమర్లు నెలల తరబడి వేచిచూస్తున్నారన్నారు. 2022లో ఇప్పటి వరకు ఈ సెగ్మెంట్‌లో 4,000 యూనిట్లకు పైగా ఆర్డర్లు అందాయన్నారు. 2021లో రూ.1 కోటి కంటే ఎక్కువ విలువ చేసే కార్లు 2000 యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయని తెలిపారు.

బీఎండబ్ల్యూ ప్రీమియం కార్లకు కూడా ఇదే స్థాయి డిమాండ్‌ ఉందని కంపెనీ భారత ప్రతినిధి విక్రమ్‌ తెలిపారు. ఎక్స్‌3, ఎక్స్‌4, ఎక్స్‌7 వంటి ‘స్పోర్ట్స్‌ యాక్టివిటీ వెహికల్స్‌’కు డిమాండ్ భారీగా ఉందన్నారు. ఈ విభాగంలో 40శాతం వరకు వృద్ధి కనిపిస్తోందన్నారు. 2022 తొలి మూడు నెలల్లో రూ.61 లక్షలు విలువ చేసే తమ కంపెనీ కార్ల విక్రయాల్లో 40 శాతం వృద్ధి నమోదైందన్నారు.

సెమీకండక్టర్ల కొరత, రవాణా ఛార్జీల పెరుగుదల, ఉక్రెయిన్‌-రష్యా యుద్ధ ప్రభావం వంటి సవాళ్లు ఈ ఏడాది చివరి నాటికి తొలగిపోతాయని ఆయా కంపెనీల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని