Billionaires: ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్‌ అవతరణ

కరోనా సంక్షోభం సమాజంలో ఆర్థిక అంతరాలకు ఎలా కారణమయ్యిందో ఆక్స్‌ఫామ్‌ నివేదిక కళ్లకు కట్టింది....

Published : 23 May 2022 14:33 IST

ఆక్స్‌ఫామ్‌ నివేదికలో ఆసక్తికర అంశాలు

దావోస్‌: కరోనా సంక్షోభం సమాజంలో ఆర్థిక అంతరాలకు ఎలా కారణమయ్యిందో ఆక్స్‌ఫామ్‌ నివేదిక కళ్లకు కట్టింది. ఈ ఏడాది మహమ్మారి మూలంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్‌ పుట్టుకొచ్చినట్లు తెలిపింది. అదే సమయంలో ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడు పేదరికంలోకి జారుకున్నట్లు వివరించింది. దావోస్‌ వేదికగా జరుగుతున్న ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సమావేశంలో ‘ప్రాఫిటింగ్‌ ఫ్రమ్‌ పెయిన్‌’ పేరిట రూపొందించిన నివేదికను ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసింది.

నివేదికలో ఇతర కీలకాంశాలు..

* గత దశాబ్దాలతో పోలిస్తే నిత్యావసరాల ధరలు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. దీంతో ఆహారం, ఇంధన రంగాల్లో ఉన్న బిలియనీర్ల సంపద ప్రతి రెండు రోజులకు 1 బిలియన్‌ డాలర్ల చొప్పున పెరిగింది. 

* పేదరికాన్ని రూపుమాపడానికి దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. పెరుగుతున్న ధరల కారణంగా నిత్యావసరాల ధరలు పెరిగి బీదలు జీవనం సాగించడానికే అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. 

* ప్రతి 30 గంటలకు ఒక బిలియనీర్‌ చొప్పున మహమ్మారి సమయంలో 573 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. అలాగే ప్రతి 33 గంటలకు 10 లక్షల మంది చొప్పున మొత్తం ఈ ఏడాది 236 మిలియన్ల మంది పేదరికంలోకి జారుకోనున్నారు. 

* కొవిడ్-19 వెలుగులోకి వచ్చిన తర్వాత తొలి 24 నెలల్లో బిలియనీర్ల సంపద గత 23 సంవత్సరాలలో కలిపిన దానికంటే ఎక్కువగా పెరిగింది.

* ప్రస్తుతం బిలియనీర్ల సంపద ప్రపంచ జీడీపీలో 13.9 శాతానికి చేరింది. ఇది 2000 ఏడాదిలో 4.4 శాతంగా ఉండేది. అయితే, ఈ పెరుగుదల బిలియనీర్ల నైపుణ్యాల వల్లనో లేక కష్టపడి పనిచేయడం వల్లనో పెరగలేదు.

* ఇంధనం, ఆహారం, ఔషధ రంగంలోని వ్యాపారులు రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జిస్తున్నారు. అదే సమయంలో అందులో పనిచేసే శ్రామికులు మాత్రం పెరుగుతున్న ధరల కారణంగా నిత్యావసర వస్తువులు కూడా కొనలేని స్థితికి చేరుతున్నారు.

* శ్రీలంక నుంచి సుడాన్‌ వరకు ధరల పెరుగుదల సామాజిక, రాజకీయ సంక్షోభాలకు దారితీస్తోంది. దాదాపు 60 శాతం అల్పాదాయ దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి దివాలా అంచున ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని