Monetary Policy: కీలక వడ్డీరేట్లు మళ్లీ మారలేదు

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు...

Updated : 08 Apr 2022 11:38 IST

ముంబయి: ఆర్‌బీఐ వరుసగా 11వ సారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఫలితంగా రెపో రేటు 4 శాతంగా కొనసాగనుంది. ద్రవ్యలభ్యతను మెరుగుపరిచే ఉద్దేశంతో రివర్స్‌ రెపోరేటును సైతం గతంలో మాదిరిగానే 3.35 శాతం వద్దనే ఉంచారు. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు.

కొవిడ్‌ సంక్షోభం ప్రారంభమైన తొలినాళ్లలో ద్రవ్యలభ్యత కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రారంభమైన సర్దుబాటు వైఖరిని దాదాపు అటూఇటూగా ఆర్‌బీఐ ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చింది. అయితే, ఈసారి సర్దుబాటు ఉపసంహరణ వైఖరికి మారుతున్నట్లు పేర్కొనడం గమనార్హం. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్లను పెంచనున్నట్లు ఫెడరల్‌ రిజర్వ్‌ స్పష్టం చేసింది. దేశీయంగా ఇంధన, కమొడిటీ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కలవరపెడుతోంది. అయినప్పటికీ.. ఆర్‌బీఐ మాత్రం వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

గవర్నర్‌ ప్రసంగంలోని ఇతర కీలకాంశాలు..

ద్రవ్యోల్బణం 5.7%: తాజా ఆర్థిక సంవత్సరంలో సగటున 5.7 శాతం ద్రవ్యోల్బణం కొనసాగనున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేసింది. ఏప్రిల్‌-జూన్‌లో 6.3%, జులై-సెప్టెంబరులో 5%, అక్టోబరు-డిసెంబరులో 5.4%, జనవరి-మార్చిలో 5.1% ఉండనున్నట్లు తెలిపింది.

సురక్షిత, భద్రతతో కూడిన చెల్లింపు వ్యవస్థను ప్రోత్సహించే దిశగా అన్ని బ్యాంకుల శాఖలు, ఏటీఎంలలో కార్డురహిత నగదు ఉపసంహరణ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

10 ఏళ్ల కాలపరమితి గల ప్రభుత్వ బాండ్ల రాబడులు 7 శాతానికి చేరాయి. జూన్‌ 2019 తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి.

రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును 7.2 శాతానికి కుదించారు.

పెట్రో ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం ఎగబాకడానికి కారణం కావొచ్చు. అలాగే సమీప భవిష్యత్తులో వంట నూనెల ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు.

వ్యవస్థలో ఉన్న రూ.8.5 లక్షల కోట్ల అదనపు ద్రవ్యలభ్యతను క్రమంగా దశలవారీగా ఆర్‌బీఐ ఉపసంహరించనుంది.

‘‘ఆర్‌బీఐ ఎలాంటి నిబంధనలకు బందీ అయిలేదు. భారత ఆర్థిక వ్యవస్థకు రక్షించేందుకు అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను వినియోగించుకుంటాం’’ - శక్తికాంత దాస్‌

మార్కెట్‌లో ఆర్థిక స్థితిని సక్రమంగా నిర్వహించడానికి, ప్రపంచ పరిణామాల ప్రభావం నుంచి ప్రతికూల వాతావరణాన్ని అరికట్టడానికి ఆర్‌బీఐ అన్ని చర్యలు తీసుకుంటుంది.

కరోనా సంక్షోభంతో కుంటుపడిన దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటోంది.

ఒమిక్రాన్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో పుంజుకున్న ఆర్థిక వ్యవస్థ ఫలాలను ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతలు తుడిచిపెట్టేశాయి.

ఆర్‌బీఐ వద్ద సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు సంసిద్ధంగా ఉన్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని