మహిళలు బీమా పాలసీ తీసుకోవాలా?

చాలా ఇళ్లల్లో మగవారి పేరుమీదే జీవిత బీమా పాలసీలు ఉంటాయి

Updated : 01 Jan 2021 16:33 IST

దంపతులు ఇద్దరూ ఆర్జించే కుటుంబాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆర్థిక ప్రణాళికలు, జీవిత బీమా పాలసీలు, పన్ను ఆదా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇద్దరికీ తప్పనిసరి అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్జించే మహిళలు ఆదాయపు పన్ను విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పన్ను ఆదాకు ఉన్న అన్ని మార్గాలనూ ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి. ఆదాయపు పన్ను చట్టం అనుమతించిన పరిమితికి మించి ఆదాయం ఆర్జించినప్పుడు నిబంధనల మేరకు పన్ను చెల్లించాల్సిందే. కాబట్టి, కేవలం పురుషులకే కాదు… మహిళలకూ ఆదాయపు పన్ను ప్రణాళిక ఉండాలి. పన్ను ప్రణాళికలు వేసుకునేప్పుడు వయసు, వస్తున్న ఆదాయం, సొంతంగా తనకు ఉన్న లక్ష్యాలు, కుటుంబ ఆర్థిక లక్ష్యాలు తదితరాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకోవాలి. చాలామంది మహిళలు పన్ను ఆదా గురించి ఫిబ్రవరి-మార్చిలలోనే పట్టించుకుంటారు. ఆర్థిక సంవత్సరం చివరినాటికి ఆదాయపు పన్ను పథకాల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన రశీదులను యాజమాన్యానికి అందించాల్సి ఉంటుంది. ఆర్జించే మహిళలు తమ పన్ను ప్రణాళికలను ముందునుంచే సిద్ధం చేసుకుంటే… చివర్లో ఈ హడావుడి ఉండదు.

ఇద్దరూ సంపాదిస్తున్నప్పటికీ… చాలా ఇళ్లల్లో మగవారి పేరుమీదే జీవిత బీమా పాలసీలు ఉంటాయి. మహిళలకు జీవిత బీమా అవసరం లేదనే అనుకుంటారు చాలామంది. కానీ, కుటుంబానికి ఇద్దరూ ఆధారం అయినప్పుడు… అనుకోని పరిస్థితుల్లో ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు… ఆర్థికంగా ఎంత ఇబ్బంది? కాబట్టి, మహిళలూ… జీవిత, ఆరోగ్య బీమా పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. చాలామంది మహిళలు తమ ఆరోగ్య పరిరక్షణ అనేది చిట్టచివరి ప్రాధాన్యంగా పరిగణిస్తారు. ఈ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వైద్య చికిత్స ఖర్చులు పెరిగిపోతున్నాయి. జీవనశైలి వ్యాధులూ అధికం అవుతున్నాయి. ఏదైనా అనుకోనిది జరిగి, ఆసుపత్రిపాలైనప్పుడు… ఆర్థికంగా దెబ్బతినకుండా ఉండేందుకు ఆరోగ్య బీమా పాలసీ, క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలను తీసుకోవాలి. బీమా పాలసీల్లో మదుపు చేయడం వల్ల పొదుపు చేసేందుకు కూడా అవకాశం కలుగుతుంది. భవిష్యత్తులో పెరిగే జీవన ఖర్చులు, పిల్లల విద్యాభ్యాసం, పదవీ విరమణ తర్వాత జీవితానికి అవసరమయ్యే మొత్తం సమకూర్చుకునేందుకూ వీలవుతుంది.

  • జీవిత బీమా పాలసీని ఎంచుకునేప్పుడు మహిళలు కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. తమ కుటుంబానికి ఉండే ఆర్థిక బాధ్యతలు, ఖర్చులు, లక్ష్యాలను బట్టి బీమా మొత్తాన్ని నిర్ణయించుకోవాలి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణనిచ్చే టర్మ్‌ పాలసీలను పరిశీలించవచ్చు. అదే సమయంలో 10-15ఏళ్ల దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు చేయడం మంచిది. యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలను ఎంచుకోవడం కంటే మ్యూచువల్ ఫండ్లు మేలు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్లతో సెక్షన్ 80C కింద మినహాయింపు పొందొచ్చు. అయితే, పన్ను ఆదా అనేది ఒక అదనపు ప్రయోజనమే. కాబట్టి, అవసరాలేమిటి?అన్నది నిర్ణయించుకున్నాకే ఎంచుకోవాలి. ఒకవేళ తర పధకాలు, అంటే పీపీఎఫ్, ప్రోవిడెంట్ ఫండ్, లాంటి వాటితో మినహాయింపు పొందగలిగితే పన్ను ఆదా ఫండ్లలో కాకుండా ఇండెక్స్ ఫండ్లలో మదుపు చేయడం మేలు. జీవిత బీమా పాలసీ మొత్తంలో గరిష్ఠంగా 10శాతాన్ని మాత్రమే మినహాయింపు కోసం అనుమతిస్తారు. కాబట్టి, ఈ విషయమూ పాలసీకి ప్రీమియం చెల్లించేప్పుడు చూసుకోవాలి.

  • మహిళలు తప్పనిసరిగా ఆరోగ్య బీమాకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ బీమాకు చెల్లించిన ప్రీమియానికి సెక్షన్‌ 80డీ కింద రూ.25వేల వరకూ మినహాయింపు లభిస్తుంది. మీ పేరుమీద కుటుంబానికి అంతటికీ వర్తించేలా ఆరోగ్య బీమా పాలసీని తీసుకొని, పన్ను ఆదా చేసుకునేందుకు చూడాలి. తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకీ రూ.25,000ల (వారు సీనియర్‌ సిటిజన్లయితే రూ. 50వేలు) వరకూ క్లెయిం చేసుకోవచ్చు. కాబట్టి, తల్లిదండ్రుల కోసం పాలసీ తీసుకొని, వారి వైద్య ఖర్చులకు ధీమా కల్పించవచ్చు.

  • ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు గరిష్ఠంగా రూ.5వేలను పన్ను మినహాయింపు కోసం చూపించుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి, 30ఏళ్లు దాటిన మహిళలు తప్పనిసరిగా ఈ వెసులుబాటును ఉపయోగించుకోవాలి. ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు నగదు ద్వారా చెల్లింపులు చేసినా మినహాయింపు లభిస్తుంది. కానీ, ఆరోగ్య బీమా పాలసీలకు చెక్కు ద్వారా చెల్లించిన ప్రీమియాన్నే మినహాయింపు కోసం పరిగణనలోనికి తీసుకుంటారు.

సరైన బీమా పాలసీలను ఎంచుకోవడం ఎప్పుడూ ముఖ్యమే. కాబట్టి, అవసరం ఏమిటి? ఏయే ప్రయోజనాలున్నాయి… ఎంత ప్రీమియం చెల్లించాలి… ఇలాంటి అన్ని విషయాలనూ బేరీజు వేసుకోవాలి. ఇది ఒక్క బీమా పాలసీల విషయంలోనే కాదు… ఏ పెట్టుబడి విషయంలోనైనా ఇదే వర్తిస్తుంది. అవసరాలు మారినప్పుడు బీమా పాలసీల విషయంలోనూ మార్పులూ చేర్పులూ చేసుకోవాలి. బీమా పాలసీల ప్రధాన లక్ష్యం… ఆర్థిక భద్రత కల్పించడమే. పన్ను ఆదా అనేది కేవలం అది అందించే అదనపు ప్రయోజనం అని గుర్తించాలి. వీలైనంత వరకు బీమా, పెట్టుబడి కలిపి ఉన్న పాలసీ ల నుంచి దూరంగా ఉండడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని