‘ఎక్స్‌’లో గణనీయంగా పెరిగిన వీడియో వీక్షణలు: సీఈఓ లిండా యాకరినో

ఎలాన్‌ మస్క్‌ లక్ష్యానికి అనుగుణంగా ఎక్స్‌ క్రమంగా వీడియోలకు ప్రధాన వేదికగా మారుతోందని కంపెనీ సీఈఓ లిండా యాకరినో తెలిపారు.

Updated : 15 Mar 2024 13:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత సోషల్‌ మీడియా యాప్‌ ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్‌) అనేక మార్పులకు లోనైంది. దీన్ని ఆయన బహుళ అవసరాల వేదికగా మార్చాలని యోచిస్తున్నారు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వెల్లడించారు. ఒకప్పుడు కేవలం మెసేజ్‌లు, చిన్న వీడియోలకు మాత్రమే పరిమితమైన యాప్‌ను క్రమంగా ఇతర విభాగాల్లోకీ విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగానే వీడియో ఫీచర్లను మెరుగుపర్చారు. అధిక నిడివి గల వీడియోలను పోస్ట్‌ చేసేందుకు యూజర్లకు అవకాశం ఇచ్చారు. పలు సంస్థలతో జట్టు కట్టి పాపులర్‌ షోలను స్ట్రీమ్‌ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాము ఆశించిన ఫలితాలు వస్తున్నాయని కంపెనీ తెలిపింది. ‘ఎక్స్‌’ను వీడియోలకు అడ్డాగా మార్చాలనుకుంటున్న లక్ష్యం క్రమంగా నెరవేరుతోందని పేర్కొంది. వార్షిక ప్రాతిపదికన తమ వేదికపై వీడియోలను వీక్షిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు సీఈఓ లిండా యాకరినో వెల్లడించారు. వీడియో వీక్షణల్లో దాదాపు 35 శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపారు. ‘ఎక్స్‌’లో వీడియోలపై యూజర్లు వెచ్చిస్తున్న సమయం 17 శాతం పెరిగినట్లు చెప్పారు. ‘ఎక్స్‌’ ఓపెన్‌ చేసినపుడు ప్రతి ఐదుగురు యూజర్లలో నలుగురు కచ్చితంగా కనీసం ఒక వీడియోనైనా చూస్తున్నారని పేర్కొన్నారు. దీంతో యాప్‌ను వీడియో కేంద్రీకృత వేదికగా మార్చాలనుకుంటున్న మస్క్‌ లక్ష్యం నెరవేరుతోందని చెప్పారు.

ఎక్స్‌ ప్రీమియం సబ్‌స్క్రైబర్లు రెండు గంటల నిడివితో ఉన్న వీడియోలు పోస్ట్‌ చేయొచ్చని ఎలాన్‌ మస్క్‌ గత ఏడాది మేలో ప్రకటించారు. అలాగే గరిష్ఠంగా 8జీబీ వీడియోలను పోస్ట్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు నుంచి లైవ్‌ వీడియోలను సైతం స్ట్రీమ్‌ చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. కంటెంట్‌ క్రియేటర్లు అనుమతి ఇస్తే వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షన్‌ను కూడా తీసుకొచ్చారు. వీడియో రికమండేషన్‌ అల్గారిథమ్‌నూ మెరుగుపర్చారు. ఈ నేపథ్యంలోనే ఎక్స్‌లో వీడియోలకు ఆదరణ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని