సుక‌న్య స‌మృద్ధి యోజ‌న Vs చైల్డ్‌ ఇన్సూరెన్స్‌.. ఏది మంచిది?

పిల్లల చదువు, వారి భవిష్యత్‌ కోసం స‌రైన పొదుపు ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టడం త‌ల్లిదండ్రులకు చాలా అవసరం. విద్యతో పాటు వివాహం, వ‌స‌తి మొద‌లైన కొన్ని ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాలు చేరుకోవడానికి ఎంతో జాగ్రత్తగా మదుపు చేయాలి. 

Updated : 17 Feb 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లల చదువు, వారి భవిష్యత్‌ కోసం స‌రైన పొదుపు ప‌థ‌కంలో పెట్టుబ‌డి పెట్టడం త‌ల్లిదండ్రులకు చాలా అవసరం. విద్యతో పాటు వివాహం మొద‌లైన కొన్ని ఇత‌ర ఆర్థిక ల‌క్ష్యాలు చేరుకోవడానికి ఎంతో జాగ్రత్తగా మదుపు చేయాలి.  ముఖ్యంగా ఆడ పిల్లల కోసం ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం అందిస్తోంది. అయితే, దురదృష్టవశాత్తూ ఆదాయం కలిగిన త‌ల్లిదండ్రులు దూరమైతే..? అయినా, ల‌క్ష్యాల‌ను చేరుకోవాలనుకుంటే..?  ఇందుకోసం పిల్లల కోసం అనేక చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. మరి ఈ రెండింట్లో ఏది మంచిది...?  వీటికున్న పరిమితులేంటో ఇప్పుడు చూద్దాం..

సుక‌న్య స‌మృద్ధి యోజ‌న: బాలిక‌కు 10 సంవ‌త్సరాల వయసు వ‌చ్చే వ‌ర‌కు వారి త‌ల్లిదండ్రులు లేదా చ‌ట్టపరమైన సంర‌క్షకులు సుక‌న్య స‌మృద్ధి యోజ‌న ఖాతాను తెర‌వొచ్చు.

లాభాలు: పోస్టాఫీసులో ఇత‌ర స్కీమ్‌లు కన్నా సుక‌న్య స‌మృద్ధి యోజ‌న పథకంలోనే వడ్డీ రేటు ఎక్కువ‌. ఈ స్కీమ్ ఖాతాదారుల‌కు 7.60% వ‌డ్డీ రేటును అందిస్తుంది. దీని మెచ్యూరిటీ వ్యవధి 21 సంవత్సరాలు. 15 ఏళ్ల పాటు డిపాజిట్‌ చేయాలి. అమ్మాయికి 18 ఏళ్లు నిండిన‌ప్పుడు ఖాతా బ్యాలెన్స్‌లో 50% పాక్షిక ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమతిస్తారు. దీన్ని విద్యా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 21 సంవత్సరాలు అయినప్పటికీ 18 ఏళ్లు నిండిన త‌ర్వాత అమ్మాయి వివాహం చేసుకుంటే ఈ ఖాతాను ముందుగానే మూసివేయొచ్చు. మొత్తం బ్యాలెన్స్ ఉప‌సంహ‌రించుకోవ‌చ్చు. ఈ ఖాతాల్లో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ ప‌న్ను ప్రయోజనాలు ఉన్నాయి. వ‌డ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా ప‌న్ను ర‌హితం.

ప‌రిమితులు: సుక‌న్య స‌మృద్ధి ఖాతాలు బాలిక‌ల కోసం మాత్రమే. పోస్టాఫీసులో ఏ త్రైమాసికంలోనైనా వ‌డ్డీ రేటు త‌గ్గితే మెచ్యూరిటీ మొత్తం త‌గ్గుతుంది. సంపాద‌న‌లో ఉన్న త‌ల్లిదండ్రులు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో ఈ స్కీమ్‌లో పెట్టుబడులు ఆగిపోతాయి. లబ్ధి పొందాల్సిన బాలిక‌ల ఆర్థిక లక్ష్యాలు నెరవేరవు.

చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్: చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా పిల్లల ఉన్నత చ‌దువులు, వివాహం మొద‌లైన వాటి కోసం ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నాయి. అంతేకాకుండా, ఈ ఇన్సూరెన్స్‌లు బాలిక‌లే కాకుండా బాలురు పేరిట కూడా తీసుకోవచ్చు.

లాభాలు: చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లానుల్లో సంపాదిస్తున్న త‌ల్లిదండ్రులు (పాల‌సీ క‌ట్టేవారు) దుర‌దృష్టవశాత్తూ దూరమైనా ప్రీమియం చెల్లించ‌కుండానే పాల‌సీ కొన‌సాగుతుంది. త‌ల్లిదండ్రులు మెచ్యూరిటీ వ్యవధిని ఎంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో మ‌నీ బ్యాక్ (న‌గ‌దులో కొంత భాగాన్ని తీసుకోవ‌డం) లాంటి సౌక‌ర్యాలుంటాయి. సుకన్య సమృద్ధి యోజనలానే చైల్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లానుల్లో పెట్టుబడులకు సెక్షన్‌ 80సీ కింద పన్ను ప్రయోజనాలు ఉంటాయి. మెచ్యూరిటీ, మ‌నీ బ్యాక్‌ కూడా ప‌న్ను ర‌హితంగా ఉంటాయి.

ప‌రిమితులు: త‌క్కువ బోన‌స్ రేటు ఉంటుంది. ఆర్థిక అవ‌స‌రాలు తీర‌డానికి త‌ల్లిదండ్రులు అధిక హామీ మొత్తాన్ని (స‌మ్ అష్యూర్డ్‌) ఎంచుకోవాలి. అధిక హామీ మొత్తానికి ప్రీమియం కూడా అధికంగా ఉంటుంది. ఏ స్కీమ్‌ని ఎంచుకోవాల‌నేది పెట్టుబ‌డి పెట్టేవారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. చాలా వరకు ఇలాంటి సంప్రదాయ పథకాల సగటు వార్షిక రాబడి 4-5 శాతం మాత్రమే ఉంటుంది. వీటిలో బీమా హామీ, పెట్టుబడి ఉన్నప్పటికీ రెండూ కూడా తక్కువే.

చివరగా..: పిల్లల భవిష్యత్‌కు 10-15 సంవత్సరాలు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP) ద్వారా పెట్టుబ‌డులు పెట్టి, కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరు మీద అద‌నంగా ట‌ర్మ్ ఇన్సూరెన్స్‌ని తీసుకుంటే కుటుంబానికి భ‌విష్యత్‌లో వచ్చే అన్ని ఆర్థిక సమస్యలకు చెక్ పెట్టొచ్చని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఆడ పిల్లలు ఉన్నట్టయితే కొంత మొత్తాన్ని రిస్క్ లేని సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడి పెట్టొచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts