TATA Nexon EV Max: ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 437 కి.మీ.. టాటా కొత్త ఎలక్ట్రిక్‌ కారు

టాటా మోటార్స్‌ తమ విద్యుత్తు వాహనాల రేంజ్‌ను విస్తరించింది. నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ పేరిట మరో కొత్త కారును బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది....

Published : 11 May 2022 18:50 IST

దిల్లీ: టాటా మోటార్స్‌ తమ విద్యుత్తు వాహనాల రేంజ్‌ను మరింత విస్తరించింది. నెక్సాన్‌ ఈవీ మ్యాక్స్‌ పేరిట మరో కొత్త కారును బుధవారం మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు ధరల శ్రేణి రూ.17.74 - 19.24 లక్షలు. ఇందులో ఎకో, సిటీ, స్పోర్ట్‌ అనే మూడు డ్రైవిండ్‌ మోడ్‌లు ఉన్నాయి.

బ్యాటరీ: ఈ కారులో 40.5 కేడబ్ల్యూహెచ్‌ లిథియం-ఐయాన్‌ బ్యాటరీని అమర్చారు. నెక్సాన్‌ ఈవీతో పోలిస్తే దీని సామర్థ్యం 33 శాతం అధికం. ఏఆర్‌ఏఐ ధ్రువీకరణ ఉన్న బ్యాటరీ ప్యాక్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే కారు 437 కి.మీ ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. దీన్ని 50 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్‌ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్‌ చేయొచ్చు.

9 సెకన్లలో 100 కి.మీ: ఈ కారు ఇంజిన్‌ 250 ఎన్‌ఎం గరిష్ఠ టార్క్‌ దగ్గర 105 కేడబ్ల్యూ శక్తిని విడుదల చేస్తుంది. ఇది కేవలం 9 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.

భద్రతా ఫీచర్లు: ఒక్కసారిగా బ్రేక్‌ వేసినప్పుడు కారు ఎక్కవ దూరం దూసుకెళ్లకుండా సురక్షితంగా ఆగేలా ‘ఇంటెలిజెంట్‌ వాక్యూమ్‌ లెస్‌ బూస్ట్‌ అండ్‌ యాక్టివ్‌ కంట్రోల్‌’ వ్యవస్థను అమర్చారు. అన్ని వీల్స్‌కు డిస్క్‌ బ్రేకులిచ్చారు. బ్రేక్‌ అసిస్ట్‌, బ్రేక్‌ ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌తో కూడిన యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టంను ఏర్పాటు చేశారు. బ్యాటరీ ప్యాక్‌ను షాక్‌, నీరు, దుమ్ము నుంచి రక్షించేలా పటిష్ఠంగా అమర్చినట్లు కంపెనీ తెలిపింది. హిల్‌ హోల్డ్‌ అసిస్ట్‌, హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, ఆటో హోల్డ్‌, ప్యానిక్‌ బ్రేక్‌ అలర్ట్‌, పిల్లల కోసం ప్రత్యేకమైన ఐసోఫిక్స్‌ యాంకరేజ్ సీటు‌, అన్ని వేరియంట్లలో ముందు భాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అత్యాధునిక ఫీచర్లూ ఉన్నాయి.

అదనపు ఫీచర్లు: ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌, రేర్‌ ఏసీ వెంట్స్‌, వెంటిలేటెడ్‌ లెదర్‌ సీట్లు, ఎయిర్‌ ప్యూరిఫయర్‌ వంటి అదనపు ఫీచర్లను అందించారు.

టెక్ ఫీచర్లు: వైర్‌లెస్‌ స్మార్ట్‌ఫోన్‌ ఛార్జర్‌, ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌, ఆటో డిమ్మింగ్‌ ఐఆర్‌వీఎం, హర్మన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌, స్మార్ట్‌వాచ్‌ ఇంటగ్రేషన్‌, రిమోట్‌ కమాండ్‌, ఇంట్రూజన్‌ అలర్ట్‌, ఛార్జ్‌ లిమిట్‌ సెట్టింగ్ వంటి అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లను పొందుపరిచారు.

వివిధ వేరియంట్ల ధరలు..

  • ఎక్స్‌జెడ్‌+ : రూ.17.74 లక్షలు
  • ఎక్స్‌జెడ్‌+ లక్స్‌ : రూ.18.74 లక్షలు
  • ఎక్స్‌జెడ్‌ + ఏసీ ఎఫ్‌సీ డబ్ల్యూఎంయూ : రూ.18.24 లక్షలు
  • ఎక్స్‌జెడ్‌+ లక్స్‌ ఏసీ ఎఫ్‌సీ డబ్ల్యూఎంయూ : రూ.19.24 లక్షలు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని