జీతం పెరిగిందా? అయితే క్రమానుగత పెట్టుబడులూ పెంచుకోండి

జీతం పెరిగిన‌ప్ప‌డు అందుకనుగుణంగా పెట్టుబ‌డుల ప‌రిమితిని పెంచుకుంటే ఆర్థిక ల‌క్ష్యాల‌ను త్వ‌ర‌గా చేరుకోవ‌చ్చు

Updated : 02 Jan 2021 13:19 IST

వార్షిక వేతనాలు పెరుగుతున్న తరుణమిది. కొందరికి ప్రమోషన్ల రూపంలో చేతికందే జీతం పెరుగుతుంది. ఈ అదనపు సొమ్మును విలాసవంతంగా ఖర్చు చేద్దామా లేదా అలాగే బ్యాంకు ఖాతాలో ఉండనిద్దామా? ఇది వరకే వివిధ పథకాల్లో పెట్టుబడి పెట్టినట్టయితే ఈ పెట్టుబడులను మరింత పెంచుకునే ప్రయత్నం చేయడానికి ఇదే మంచి సమయం.

మ్యూచువల్‌ ఫండ్ల విషయం…

మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానంలో (సిప్‌) మదుపు చేస్తున్నట్టయితే జమచేసే సొమ్ము పరిమాణాన్ని పెంచుకోవచ్చు. నెలవారీ వేతనం పెరిగినట్టయితే ప్రతి నెలా ఎంతో కొంత అదనపు సొమ్ము బ్యాంకు ఖాతాలోకి జమ అవుతూనే ఉంటుంది. ఏదో ఒక నెల ఎందులోనో ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి వూరుకునే బదులు ఇది వరకే ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల పెట్టుబడుల పరిమితిని పెంచుకుంటే మంచి ఆలోచన. దీన్నే చాలా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు టాపింగ్‌ ఆఫ్‌ సిప్స్‌ అని వ్యవహరిస్తాయి.

చెప్పినంత సులభమా?

ఒకసారి సిప్‌ ప్రారంభించాక ఇందుకు జమచేసే సొమ్మును మధ్యలో పెంచడమంటే అంత సులువు కాదు. ఏదైనా ఒక పథకంలో క్రమానుగత పెట్టుబడి విధానాన్ని ప్రారంభించినప్పుడు ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ మ్యాండేట్‌ (ఈసీఎస్‌) ఫారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈసీఎస్‌ అంటే మన ఖాతాలో నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ పథకానికి నేరుగా డబ్బులు డెబిట్‌ అయ్యేలా బ్యాంకుకు అధికారమివ్వడం. ఈసీఎస్‌ మ్యాండేట్‌లో ముందే పెట్టుబడిదారు నిర్ణీత సొమ్మును, నిర్ణీత తేదీలో డెబిట్‌ చేసుకోవాల్సిందిగా సూచిస్తాడు. దాని ప్రకారమే బ్యాంకు ఖాతా నుంచి సొమ్ము డెబిట్‌ అవుతుంది.
సిప్‌ పెట్టుబడిని మధ్యలో పెంచుకోవాలనుకుంటే ఈసీఎస్‌ మ్యాండేట్‌ను మార్చుకోవాల్సిందే. పైగా ఇలా మధ్యలో సిప్‌ పెట్టుబడిని మార్చుకునేందుకు ఫండ్‌ సంస్థలు అంత సులభంగా అంగీకరించవు.

దర‌ఖాస్తు సమయంలోనే…

క్రమానుగత విధానం ప్రారంభించే సమయంలోనే ఫండ్‌ సంస్థలు దరఖాస్తు పత్రంలో సిప్‌ పెట్టుబడిని మధ్యలోనే పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఆరు నెలలకు ఒకసారి, ఏడాదికోసారి సిప్‌ పెట్టుబడిని పెంచుకునే ఏర్పాటు కల్పిస్తున్నాయి కొన్ని మ్యూచవల్‌ ఫండ్‌ సంస్థలు.

దీని కోసం దరఖాస్తు ఫారంలో ముందుగానే సూచించాల్సి ఉంటుంది. ఉదాహరణకు కొత్త సిప్‌ను రూ.2000తో ప్రారంభించారనుకోండి. ఆరు నెలల తర్వాత దీనికి అదనంగా రూ.500 పెంచాలని సూచిస్తే … ఏడో నెల నుంచి రూ.2500 జమ అవుతూ వస్తాయి. అదే ఏడాది తర్వాత రూ.3000 జమ అవుతూ వస్తాయి. ఇలా అదనపు సొమ్ము జమ కాకుండా ఉండాలని అనుకుంటే మాత్రం ప్రస్తుతం కొనసాగిస్తున్న సిప్‌ను రద్దు చేసుకొని కొత్త సిప్‌ ప్రారంభించాల్సి ఉంటుంది.

మీ పథకం ఇందుకు అనుకూలమో కాదో తెలుసుకోండి…

దరఖాస్తులో ముందుగానే సూచించే అవసరం లేకుండానే కొన్ని ఫండ్‌ సంస్థలు సిప్‌ పెట్టుబడిని మధ్యలో మార్చుకునే వెసులుబాటును కల్పిస్తున్నాయి. కనీసం రూ.500 పెంచేందుకు అనుమతిస్తున్నాయి. మీ ఏజెంటును లేదా మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థను సంప్రదించి ఇలా మధ్యలో సిప్‌ పెట్టుబడిని పెంచుకోవచ్చో లేదో కనుక్కోండి. ఈ సదుపాయం అందుబాటులో ఉంటే దీనికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. కుదరని పక్షంలో ఉన్న సిప్‌ను రద్దు చేసుకొని కొత్త సిప్‌ను ప్రారంభించడమో లేదా రెండూ కొనసాగించే ప్రయత్నమో చేయడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని