కూకట్‌పల్లిలో కారు బీభత్సం

నగరంలోని కూకట్‌పల్లిలో కారు బీభత్సం సృష్టించింది. సౌత్‌ ఇండియా షాపింగ్‌మాల్‌ వద్ద ఈ ఘటన జరిగింది.

Updated : 04 Sep 2020 22:36 IST

ఒకరి మృతి.. ముగ్గురికి గాయాలు

నాలుగు వాహనాలు ధ్వంసం 

మూసాపేట: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం భయానక వాతవరణాన్ని తలపించే రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరు మెట్రో పిల్లర్ల పొడవునా దారంతా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఉన్నఫలంగా జరిగిన ఈ ఘటనతో అటుగా వెళ్తున్న వారు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఓ వ్యాపారవేత్త అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. 

ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్యాస్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్న కాలే అశోక్‌ (40) అనే వ్యక్తి మధ్యాహ్న భోజనం ముగించుకున్న అనంతరం తన ద్విచక్ర మోటారు వాహనంపై తిరిగి తన కార్యాలయానికి బయలుదేరారు. కేపీహెచ్‌బీకాలనీ మెట్రో స్టేషన్‌ దాటగానే.. పిల్లరు నంబరు 757 వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు (టీఎస్‌07జీఈ 6999) ఇతన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరిపడిన ఆయన అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అనంతరం అదే వేగంతో దూసుకెళ్లి బంజారాహిల్స్‌ నివాసి అయిన విజయ్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టంతో అతను సైతం ఎగిరి కిందపడ్డాడు. అదే సమయంలో దారిన నడుచుకుంటూ వెళ్తున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని పక్క నుంచి ఢీకొట్టడంతో కిందపడిన అతను స్వల్ప గాయాలతో అక్కడి నుంచి పరుగులు తీశాడు. కారు అంతటితో ఆగకుండా ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో అది కూడా బోల్తా పడింది. ఆ సమయంలో అందులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అయితే ఆటో యజమాని కాళ్లకు గాయాలయ్యాయి. 

ఇదే కారు పటాన్‌చెరు నుంచి నాంపల్లి వెళ్తున్న ప్రభుత్వ ఉద్యోగి శ్రీనివాస్‌రెడ్డి కారును సైతం వెనుక నుంచి ఢీకొట్టింది. చివరిగా రోడ్డుపై వెళ్తున్న ఓ ఆర్టీసీ బస్సును వెనకనుంచి ఢీకొట్టి నిలిచిపోయింది. కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ వద్ద ఉన్న పిల్లరు నంబరు 757 వద్ద మొదలైన ఈ బీభత్సం.. కూకట్‌పల్లి మార్గంలోని సౌత్‌ఇండియా షాపింగ్‌ మాల్‌ ఎదురుగా ఉన్న 763 పిల్లరు వద్ద ముగిసింది. అయితే ప్రమాదానికి కారణమైన కారులో యజమాని కొండయ్య కూడా ఉన్నారు. అయితే ఆ సమయంలో శ్రీనివాస్‌ అనే డ్రైవరు దాన్ని నడుపుతూ ఈ బీభత్సానికి పాల్పడ్డాడు. వరుసగా పలు వాహనాలను ఢీకొట్టడంతో సదరు కారు ముందు భాగం ధ్వంసమైది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మరోవైపు పోలీసులు సదరు డ్రైవర్‌కు పరీక్షలు నిర్వహించి అతడు మద్యం మత్తు లేనట్లు నిర్ధారించారు. అయితే మొదటగా అశోక్‌ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినపుడు అతను గాల్లోకి ఎగిరిపడటంతో దానికి డ్రైవర్‌ భయాందోళనకు గురై అక్కడి నుంచి బయటపడాలనే కంగారుతో కారును మరింత వేగంగా నడపటంతోనే ఈ బీభత్సం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడు అశోక్‌కు భార్య లావణ్యతో పాటు కుమారుడు, కుమార్తె  ఉన్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని