Viral news: పోలీసుల కళ్లముందే.. సినీ ఫక్కీలో గ్యాంగ్‌స్టర్‌ హత్య.. వీడియో వైరల్‌!

రాజస్థాన్‌లోని అమోలి టోల్‌ప్లాజా వద్ద సినీఫక్కీలో ఓ గ్యాంగ్‌స్టర్‌ను హత్య చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Published : 19 Jul 2023 02:14 IST

జైపుర్‌: నిందితుల్ని కోర్టుకు తీసుకెళ్తుండగా ప్రత్యర్థులు ముట్టడించి వారిపై కాల్పులు జరిపి హత్య చేయడం చాలా సినిమాల్లో చూసుంటాం. సరిగ్గా అదే తరహాలో  8 మంది దుండగులు ఓ గ్యాంగ్‌స్టర్‌ను తరలిస్తున్న బస్సును అడ్డుకొని విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గ్యాంగ్‌స్టర్‌ మరణించగా.. అతడి అనుచరుడికి తీవ్రగాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ ఘటన రాజస్థాన్‌లోని అమోలి టోల్‌ప్లాజా వద్ద జులై 12న జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

గతేడాది సెప్టెంబరులో జరిగిన ఓ హత్య కేసులో గ్యాంగ్‌స్టర్‌ కుల్‌దీప్‌, ఆయన అనుచరుడు విజయ్‌పాల్‌ నిందితులు. జైపుర్‌ కేంద్ర కారాగారంలో ఖైదీలుగా ఉన్న వారిని విచారణ నిమిత్తం భరత్‌పుర్‌లోని న్యాయస్థానానికి తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వారిద్దరికీ ఆరుగురు పోలీసులు ఎస్కార్ట్‌గా వచ్చారు. వారంతా రాజస్థాన్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ బస్సులో కోర్టుకు బయల్దేరి వెళ్లారు. బస్సు అమోలి టోల్‌ప్లాజా వద్దకు చేరుకోగానే 8 మంది దుండగులు బస్సును చుట్టుముట్టారు. ఇద్దరు డోర్‌ వద్ద నిల్చోగా మరో ఇద్దరు లోపలికి వెళ్లి గ్యాంగ్‌స్టర్‌, అతడి అనుచరుడిపై కాల్పులు జరిపారు. దీంతో అందులోని ప్రయాణికులు భయంతో కేకలు వేస్తూ కిటికీల్లోంచి కిందికి దూకేశారు. కొన్ని రౌండ్ల కాల్పుల తర్వాత బయటకి వచ్చిన యువకులు కొందరు ప్రయాణికులను దించేసి.. బస్సులోపలికి వెళ్లి కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

పోలీసులు వారిద్దరినీ ఆస్పత్రికి తరలించగా కుల్‌దీప్‌ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. విజయ్‌పాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు దాడికి పాల్పడిన నిందితులు పోలీసుల కళ్లల్లో కారం కొట్టేశారని, దీంతో వాళ్లు ప్రతిఘటించలేకపోయారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 8 మంది నిందితుల్లో ఆరుగురిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు