మహిళతో అసభ్య ప్రవర్తన: ఎస్‌ఐ సస్పెన్షన్‌

మహిళలను రక్షించాల్సిన పోలీసు అధికారి తన కర్తవ్యాన్ని మరిచి ఓ మహిళ వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు, లైంగిక దాడికి యత్నించిన

Updated : 10 Jun 2020 10:54 IST

అమరావతి: మహిళలను రక్షించాల్సిన పోలీసు అధికారి తన కర్తవ్యాన్ని మరిచి ఓ మహిళ వద్ద డబ్బు వసూలు చేయడంతో పాటు, లైంగిక దాడికి యత్నించిన ఆరోపణలు రావడం అమరావతిలో కలకలం రేపింది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ సస్పెన్షన్‌కు గురయ్యారు.

వివరాల్లోకి వెళితే... పెదకూరపాడు మండలానికి చెందిన ఓ జంట ఏకాంతంగా గడిపేందుకు సోమవారం అమరావతిలోని ఓ ప్రైవేటు లాడ్జిలో దిగారు. విషయం తెలుసుకున్న అమరావతి ఎస్సై రామాంజనేయులు తన వ్యక్తిగత వాహనంలో డ్రైవర్‌ సాయికృష్ణతో కలిసి  అక్కడికి చేరుకున్నారు. వ్యభిచారం కేసు నమోదు చేస్తానని ఆ జంటను బెదిరించి వారి వద్ద నుంచి రూ.10 వేల లంచం డిమాండ్‌ చేయగా, వారు రూ.5 వేలు ఇస్తామని చెప్పారు. తమ వద్ద ఉన్న రూ.3 వేలు ఇచ్చి మరో రూ.2 వేల కోసం బాధితుడు ఏటీఎంకు వెళ్లాడు.  అతనితో పాటు వెళ్లి రూ.2వేలు తీసుకోవాలని డ్రైవర్‌ సాయికృష్ణను కూడా వెంట పంపించాడు. ఆ తరువాత ఒంటరిగా ఉన్న మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. ఆ వ్యక్తి ఏటీఎం నుంచి తిరిగేవచ్చేంత వరకూ ఎస్సై మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఎవరికైనా విషయం  చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ జంటను హెచ్చరించాడు. వారి వివరాలు తీసుకున్న తరువాత విడిచిపెట్టాడు. జరిగిన ఘటనపై బాధితులు మంగళవారం ఎస్సైపై తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాస రెడ్డికి ఫిర్యాదు చేయగా గుంటూరు గ్రామీణ ఎస్పీ విజయారావుకు ఆయన విషయాన్ని వివరించారు. ఎస్సైపై విచారణ జరిపి నివేదిక ఇవ్వమని డీఎస్పీని ఎస్పీ ఆదేశించారు.

డీఎస్పీ విచారణ అనంతరం జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు ఎస్‌ఐ రామాంజనేయులు, డ్రైవర్‌ సాయికృష్ణను సస్పెండ్‌  చేశారు. ఎస్‌ఐతో పాటు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని