Crime: డబ్బు కోసం జూనియర్‌పై సీనియర్ల దాష్టీకం

తీసుకున్న డబ్బు తిరిగివ్వలేదనే కారణంతో ఓ యువకుడిపై అతడి సీనియర్లు విచక్షణా రహితంగా దాడి చేశారు.

Published : 08 May 2024 12:51 IST

కాన్పూర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌): ఓ కోచింగ్‌ సెంటర్‌లోని సీనియర్లు జూనియర్‌ విద్యార్థిని చిత్రహంసలకు గురి చేసిన ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధిత యువకుడు పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడానికి ఇటావా నుంచి కాన్పూర్‌కు వచ్చాడు. కోచింగ్‌ సెంటర్లో  కొందరు సీనియర్లతో పరిచయం ఏర్పడింది. వారితో పాటు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ గేమ్‌లకు అలవాటు పడిన యువకుడు గేమ్‌ ఆడేందుకు సీనియర్ల నుంచి రూ.20వేలు అప్పుగా తీసుకొని బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు. అనంతరం రూ.20 వేల అప్పుకు తమకు రూ.2లక్షలు ఇవ్వాలని సీనియర్లు అతడిని వేధించసాగారు.

విద్యార్థి డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో గదిలోకి లాక్కెళ్లి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ తతంగాన్నంతా వీడియో తీస్తూ వికృతంగా ప్రవర్తించారు. ఇదే విధంగా సీనియర్లు పలు మార్లు దాడి చేయడంతో  విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపాడు. వారు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుండడంతో కాన్పూర్‌ పోలీసులు రంగంలోకి దిగారు. 

నిందితులను తనయ్ చౌరాసియా, అభిషేక్ కుమార్ వర్మ, యోగేష్ విశ్వకర్మ, సంజీవ్ కుమార్ యాదవ్, హరగోవింద్ తివారీ, శివ త్రిపాఠిలుగా గుర్తించారు. వీరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని  డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆర్ఎస్ గౌతమ్ తెలిపారు. వీరు ఓ ముఠాగా ఏర్పడి అమాయక విద్యార్థులను ట్రాప్‌ చేసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతుంటారని ప్రాథమిక విచారణలో వెల్లడయింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని