తుపాకీతో బెదిరించి.. ఇంట్లో దోపిడీ

ఘటనకు సంబంధించి ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాలు.. జోగు ఆంజనే

Updated : 03 Jul 2022 06:16 IST

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ కోటిరెడ్డి

కుల్కచర్ల, న్యూస్‌టుడే: గుర్తుతెలియనని వ్యక్తులు తుపాకీతో బెదిరించి.. ఓ ఇంట్లో ఆభరనాలు, నగదు దోచుకుని వెళ్లిన సంఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి ఎస్‌ఐ గిరి తెలిపిన వివరాలు.. జోగు ఆంజనేయులు, అలివేలు దంపతులు. కూతురులో కలిసి కొంతకాలంగా కాళమ్మగుడి సమీపంలోని పొలంలో ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఎప్పటి మాదిరిగానే రాత్రి సుమారుగా 9.30 గంటల సమయంలో ఇంట్లో ముగ్గురు కలిసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో ముఖాలకు మంకీక్యాప్‌లను ధరించిన నలుగురు ఇంట్లోకి ప్రవేశించారు. తుపాకీ ఎక్కుపెట్టి సెల్‌ఫోన్లు లాగేసుకున్నారు. అక్కడే ఉన్న ఆయన కూతురుకు కత్తి చూపి అరిస్తే అంతు చూస్తామని హెచ్చరించారు. అలివేలు మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగేసుకున్నారు. వారిలో ఒకరు నేరుగా బిరువా వద్దకు వెళ్లి అందులో దాచిన మరో రెండు తులాల బంగారాన్ని తీసుకున్నారు. కుటుంబ సభ్యులను  ఇంట్లోనే ఉంచి తలుపులు మూసి బయట నుంచి గడియపెట్టేశారు. బాధితుల ఫోన్లను ఇంటి ఆవరణలో పడేసి వెళ్లిపోయారు. ఆ తరవాత అర్ధరాత్రి ఎలాగోలా ఇంటి బయటకు వచ్చి మండల కేంద్రంలో ఉంటున్న వారి సోదరుడికి, పోలీసులకు సమాచారాన్ని అందించారు. రెండు నెలల క్రితం కూడా ఇదే ఇంటిలో గుర్తుతెలియని దొంగలు అల్మారాలో ఉంచిన రూ.50 వేల నగదును చోరీ చేశారు. దోపిడీ జరిగిన ఇంటిని, పరిసరాల్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి శనివారం పరిశీలించారు. చోరీ ఎలా జరిగింది? ఎంత మంది వచ్చారు? తదితర వివరాలపై ఆరా తీశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే కేసును ఛేదిస్తామని చెప్పారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు