నిమజ్జనానికి ముందుగా వెళ్లారని దళితులపై దాడి.. వైకాపా నాయకుల ప్రోద్బలంతో..

దళితులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం నిమజ్జనానికి ముందుగా బయలుదేరడం వైకాపా నాయకులకు ఆగ్రహం తెప్పించింది.

Updated : 25 Sep 2023 08:27 IST

శ్రీసత్యసాయి జిల్లాలో 18 మందిపై కేసు

సోమందేపల్లి, న్యూస్‌టుడే: దళితులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహం నిమజ్జనానికి ముందుగా బయలుదేరడం వైకాపా నాయకులకు ఆగ్రహం తెప్పించింది. దళితులపై యువకులను ఉసిగొల్పి తిట్టించారు. బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో ఆగ్రహించిన నాయకులు యువతను రెచ్చగొట్టి దాడికి పంపారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి నలుగుర్ని గాయపరిచారు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి పంచాయతీ పరిధి చాకార్లపల్లిలో జరిగింది. దీంతో అధికార పార్టీ నాయకులు సహా 18 మందిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. చాకార్లపల్లిలో బుధవారం నిమజ్జనానికి మొదట దళితులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని వాహనంలో తరలిస్తుండగా.. వైకాపా నాయకుల ప్రోద్బలంతో పలువురు యువకులు అడ్డుకొని దుర్భాషలాడటంతో బాధితులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.అయితే ఎస్‌ఐ తిరుమల బ్రహ్మోత్సవాల బందోబస్తులో ఉన్నారు. వైకాపా నాయకులు రెచ్చగొట్టడంతో బీసీ యువకులు, మహిళలు శుక్రవారం రాత్రి కర్రలతో దళితకాలనీలో తిరుగుతూ కులం పేరుతో అసభ్యంగా దూషిస్తూ శ్రీనివాసులు, సుజాత, తెదేపాకు చెందిన మాజీ వార్డు సభ్యురాలు రామాంజనమ్మ, నరసింహులు దంపతులపై దాడి చేశారు. రాళ్లు విసిరి కాలనీవాసులను భయాందోళనకు గురిచేశారు. శనివారం రాత్రి గ్రామంలో సీఐ, ఎస్సైలు విచారణ జరిపి అధికార పార్టీ నాయకులైన సజ్జారెడ్డి, ఆర్‌సీ రెడ్డి, సురేశ్‌రెడ్డితో పాటు 11 మంది యువకులు, మరో నలుగురు మహిళలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. గ్రామంలో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశామని సీఐ కరుణాకర్‌, ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని