వృద్ధురాలిపై చెప్పుతో దాడి

తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువమంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో ఓ వృద్ధురాలిపై వైకాపా కదిరి అభ్యర్థి మక్బూల్‌ అహమ్మద్‌ సమీప బంధువు పరికి షామీర్‌బాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు.

Published : 27 Mar 2024 05:17 IST

నిందితుడు వైకాపా కదిరి అభ్యర్థి సమీప బంధువు

కదిరి పట్టణం, న్యూస్‌టుడే: తాము చెప్పిన సంఖ్య కంటే ఎక్కువమంది మహిళలను ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చిందన్న కారణంతో ఓ వృద్ధురాలిపై వైకాపా కదిరి అభ్యర్థి మక్బూల్‌ అహమ్మద్‌ సమీప బంధువు పరికి షామీర్‌బాషా అసభ్య పదజాలంతో దూషిస్తూ చెప్పుతో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం శ్రీసత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో చోటుచేసుకుంది. నిందితుడిపై ఫిర్యాదు చేయడానికి పట్టణ పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితురాలి వివరాల మేరకు.. వైకాపా అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసేందుకు పదిమంది మహిళలను పార్టీ కార్యాలయానికి తీసుకురావాలని స్థానిక నాయకుడు పట్టణానికి చెందిన వహీదాకు సూచించాడు. ఆమె తమ ప్రాంతానికి చెందిన 15 మందిని తీసుకెళ్లారు. పదిమందిని తీసుకురమ్మంటే ఎక్కువమందిని ఎందుకు పిలుచుకొచ్చావంటూ వృద్ధురాలిపై షామీర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడాడు. డబ్బులు ఇస్తారన్న ఆశతో అంతమంది వచ్చారని, తల్లి వయస్సున్న తనను రంజాన్‌ మాసంలో బూతులు తిడతావా అంటూ ఆమె నిలదీశారు. దీంతో మరింత ఆగ్రహించిన షామీర్‌ వృద్ధురాలిపై చెప్పుతో దాడిచేశాడు. కార్యాలయంలో ఉన్న మహిళలు సర్దిచెబుతున్నా వినిపించుకోలేదు. బాధ్యుడిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే తనకు మరణమే శరణ్యమంటూ బాధితురాలు రోదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని