పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక

బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది.

Updated : 26 Apr 2024 06:28 IST

విజయవాడకు వెళ్తూ ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
బావ, బావమరిది కుటుంబాల్లోని పది మందిలో ఆరుగురు అక్కడికక్కడే మృత్యువాత
తీవ్రగాయాల పాలైన మరో మహిళ

కోదాడ, న్యూస్‌టుడే: బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. రెండు కుటుంబాల్లోని ఓ మహిళ మినహా పెద్దలంతా మృత్యువు పాలవడం, ఆ మహిళ కూడా చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆరేళ్లు కూడా నిండని ముగ్గురు పిల్లలు దిక్కులేని వారయ్యారు. కోదాడలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం మిగిల్చిన విషాదమిది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం చిమిర్యాల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ వృత్తి రీత్యా డ్రైవర్‌. భార్య ఇద్దరు కుమార్తెలతో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాడు.

ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గోవిందాపురం(ఎల్‌) గ్రామానికి చెందిన ఆయన బావమరిది నలమల కృష్ణంరాజు కుటుంబం, అత్తామామలు కూడా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. శ్రీకాంత్‌ చిన్న కుమార్తె లావణ్య పుట్టెంట్రుకల వేడుకలు విజయవాడలోని గుణదల చర్చిలో నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఇరు కుటుంబాలకు చెందిన పది మంది కారులో బయల్దేరాయి. కోదాడ పట్టణ పరిధి శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారి వెంట ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు వెనక నుంచి ఢీకొంది. ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం మొత్తం లారీ వెనక భాగంలో ఇరుక్కుపోయింది. కారులో ప్రయాణిస్తున్న శ్రీకాంత్‌(32)తో పాటు ఆయన పెద్ద కుమార్తె లాస్య(4), ఆయన బావమరిది నలమల కృష్ణంరాజు(26), ఆయన భార్య స్వర్ణకుమారి(23), అత్తామామలు నలమల మాణిక్యమ్మ(45), చందర్‌రావు(50)లు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ భార్య నాగమణిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని వైద్యశాలకు తరలించారు.

కృష్ణంరాజు కుమారులు కౌశిక్‌, కార్తిక్‌ స్వల్ప గాయాలతో కోదాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీకాంత్‌ చిన్న కుమార్తె లావణ్యకు మాత్రమే ఎలాంటి గాయాలు కాలేదని, ఘటన స్థలాన్ని పరిశీలించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే తెలిపారు. ‘ప్రమాద సమయంలో కృష్ణంరాజు కారు నడుపుతున్నారు. అతి వేగమే దుర్ఘటనకు కారణమని ప్రాథమిక విచారణలో గుర్తించాం. నిర్లక్ష్యంగా రహదారి వెంట లారీ నిలిపిన డ్రైవర్‌ కృష్ణారెడ్డిపైనా కేసు నమోదు చేశాం’ అని ఎస్పీ వెల్లడించారు.

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి: సీఎం

ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని