అమిత్‌ షా వీడియో మార్ఫింగ్‌ కేసు.. నేరపూరిత కుట్రను చేర్చిన దిల్లీ పోలీసులు

రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్‌ఐఆర్‌లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు.

Published : 05 May 2024 03:46 IST

మూడు రోజుల కస్టడీకి అరుణ్‌రెడ్డి

దిల్లీ: రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను వక్రీకరిస్తూ రూపొందించిన నకిలీ వీడియో కేసు ఎఫ్‌ఐఆర్‌లో దిల్లీ పోలీసులు శనివారం నేరపూరిత కుట్ర అభియోగాన్ని చేర్చారు. ఇదే కేసులో కాంగ్రెస్‌ పార్టీ సామాజిక మాధ్యమ బృందం జాతీయ సమన్వయ కర్త, తెలంగాణకు చెందిన అరుణ్‌రెడ్డిని శుక్రవారం దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ వీడియో కేసులో దిల్లీ పోలీసులు చేసిన తొలి అరెస్టు ఇది. అరుణ్‌.. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో ‘స్పిరిట్‌ ఆఫ్‌ కాంగ్రెస్‌’ ఖాతా నిర్వహిస్తున్నారు. వీడియో మార్ఫింగ్‌ వ్యవహారం వెనుక భారీ కుట్ర దాగుందనే అనుమానం రావడంతోనే ఐపీసీ సెక్షన్‌ 120బి (నేరపూరిత కుట్ర) అభియోగాన్ని చేర్చామని పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. అరుణ్‌రెడ్డిని శుక్రవారం రాత్రి కోర్టులో హాజరుపరచగా మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతి లభించింది. దీంతో నిందితుడిని దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌లో ఉంచి ప్రశ్నిస్తున్నారు. నకిలీ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసిన వ్యక్తుల్లో అరుణ్‌ ఒకరని పోలీసులు పేర్కొంటున్నారు. సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం నుంచి ఫిర్యాదు రావడంతో తొలుత ఐపీసీ సెక్షన్‌ 153, సెక్షన్‌ 153ఎ, సెక్షన్‌ 465, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం సెక్షన్‌ 66సీ తదితరాలను నిందితులపై పోలీసులు మోపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని