Eluru: పండుగ పూట విషాదం.. ముగ్గు వేస్తుండగా అక్కాచెల్లెళ్లపైకి దూసుకెళ్లిన లారీ..

ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లు గ్రామంలో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు ముగ్గులు వేస్తుండగా..

Updated : 14 Jan 2024 11:21 IST

కైకలూరు, మండవల్లి:  ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొల్లులో పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ఇంటిముందు ముగ్గులు వేస్తుండగా.. అక్కాచెల్లెళ్లపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి.   

వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన తెదేపా నేత పంగిళ్ల నాగబాబు కుమార్తెలు రోడ్డు పక్కనే ఉన్న తమ ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు వేస్తున్నారు. అదే సమయంలో గుడివాడ నుంచి కైకలూరు వైపు వెళ్తున్న ఇటుకల లారీ వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తేజస్విని (16) దుర్మరణం చెందగా, పల్లవీ దుర్గకు (18) గాయాలయ్యాయి. బాధితురాలిని గుడివాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను ప్రకాశ్‌రావుగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగబాబు కుమార్తె మృతితో పెద్ద సంఖ్యలో తెదేపా నాయకులు కానుకొల్లుకు చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులతో కలిసి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. తేజస్విని, పల్లవీ దుర్గ ముదినేపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని