Murder: భార్య పేరు మీద రూ.2కోట్ల బీమా చేసి.. ఆమెను కారుతో ఢీకొట్టించి..!

బీమా డబ్బులకు ఆశపడి భార్యను చంపించాడో భర్త. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి కోట్ల రూపాయాలు కాజేయబోయాడు.

Published : 02 Dec 2022 01:33 IST

ప్రతీకాత్మక చిత్రం

జైపుర్‌: భార్య పేరు మీదున్న బీమా డబ్బుల కోసం దారుణానికి పాల్పడ్డాడో భర్త. రౌడీ షీటర్‌కు సుపారీ ఇచ్చి ఆమెను హత్య చేయించాడు. ఆ తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా నమ్మించి రూ.2కోట్లు కాజేయబోయాడు. ఎట్టకేలకు అతడి నేరం బయటపడి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళితే..

జైపుర్‌కు చెందిన మహేశ్ చాంద్‌కు 2015లో షాలు అనే మహిళతో వివాహమైంది. వీరికి ఓ కుమార్తె ఉంది. అయితే పెళ్లయిన రెండేళ్లకే వీరి మధ్య విభేదాలు రావడంతో షాలు తన కుమార్తెతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. మహేశ్‌పై గృహ హింస కేసు కూడా పెట్టింది. ఇదిలా ఉండగా.. ఇటీవల మహేశ్ తన భార్య పేరు మీద బీమా చేయించాడు. ఆ బీమాతో సహజ మరణమైతే రూ.కోటి, ప్రమాదమైతే రూ.1.90కోట్ల సొమ్ము వస్తుంది. ఆ డబ్బుపై ఆశపడిన మహేశ్.. భార్య హత్యకు పథకం పన్నాడు.

తాను మారిపోయాయని షాలును నమ్మించే ప్రయత్నం చేశాడు. తనను తిరిగి ఇంటికి తీసుకెళ్తానని, అయితే అంతకంటే ముందు ఓ మొక్కు చెల్లించాలని చెప్పాడు. 11 రోజుల పాటు ప్రతిరోజూ హనుమాన్‌ ఆలయానికి బండిపై వెళ్లి పూజలు చేయాలన్నాడు. భర్త మాటలు నమ్మిన షాలు.. రోజూ తన బంధువుతో కలిసి బైక్‌పై గుడికి వెళ్లింది. అలా అక్టోబరు 5వ తేదీన.. వీరిద్దరూ బండిపై ఆలయానికి వెళ్తుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో షాలు అక్కడికక్కడే మరణించగా..  ఆమె బంధువు గాయపడ్డారు.

తొలుత దీన్ని రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కుటుంబసభ్యులకు అనుమానం రావడంతో దర్యాప్తు చేయగా అసలు విషయం బయటపడింది. తన భార్యను చంపేందుకు మహేశ్.. ముకేశ్ సింగ్‌ రాథోడ్‌ అనే రౌడీ షీటర్‌కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ప్రమాదం జరిగిన సమయంలో షాలు భర్త కూడా రాథోడ్‌ కారు వెనుకే వచ్చినట్లు గుర్తించారు. దీంతో మహేశ్‌తో పాటు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు