Bank Robbery: బాంబుతో బెదిరించి.. బ్యాంకులో రూ.24 లక్షలు దోచేశాడు..!

ఓ ముసుగు దొంగ బ్యాంకులోకి ప్రవేశించి.. సిబ్బందిని బెదిరించి రూ.24 లక్షలతో పరారయ్యాడు. రాజస్థాన్‌లోని ఓ ప్రైవేటు బ్యాంకులో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 06 Jul 2023 21:51 IST

జైపుర్‌: పట్టపగలే బ్యాంకు దోపిడీ (Bank Robbery) జరిగింది. ముసుగు ధరించి బ్యాంకులోకి ప్రవేశించిన ఓ ఆగంతుకుడు.. వెంట తెచ్చుకున్న బాంబు పేల్చేస్తానంటూ సిబ్బందిని బెదిరించి రూ.24 లక్షలతో పరారయ్యాడు. రాజస్థాన్‌ (Rajasthan)లోని హర్‌సావా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మాస్కు ధరించిన ఓ దుండగుడు గురువారం ఇక్కడి ఒక ప్రైవేటు బ్యాంకులోకి ప్రవేశించాడు. నగదు ముట్టజెప్పాలని.. లేనిపక్షంలో తన వద్ద ఉన్న బాంబు (Bomb)ను పేల్చేస్తానని సిబ్బందిని బెదిరించాడు.

దీంతో భయపడిపోయిన సిబ్బంది తొలుత రూ.1.25 లక్షలు ఇచ్చారు. అయితే.. నిందితుడు మరింత డబ్బు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలోనే క్యాషియర్ గదిలోకి ప్రవేశించిన అతను మొత్తం రూ.24 లక్షల వరకు బ్యాగులో సర్దేశాడు. అనంతరం బ్యాంకు ప్రధాన గేటుకు తాళం వేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన సమయంలో బ్యాంకు లోపల వినియోగదారులెవరూ లేరు. ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది పోలీసులను ఆశ్రయించగా.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంకుతోపాటు పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని