సిద్ధూ మూసేవాలా తరహాలో చంపేస్తాం.. సల్మాన్‌కు బెదిరింపు మెయిల్‌!

సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala) తరహాలో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)ను చంపేస్తామంటూ బెదిరింపు ఈ-మెయిల్‌ పంపిన కేసులో ముంబయి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Updated : 27 Mar 2023 00:55 IST

ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ (Salman Khan)కు ఇటీవల వచ్చిన బెదిరింపు మెయిల్‌ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు రాజస్థాన్‌లోని రోహిచా కలాన్‌ గ్రామానికి చెందిన ధకడ్‌ రామ్‌ బిష్ణోయ్‌గా గుర్తించారు. రెండు రోజుల క్రితం సల్మాన్‌ఖాన్ ఆఫీస్‌కు  ఓ బెదిరింపు ఈ-మెయిల్‌ వచ్చింది. అందులో గోల్డీ భాయ్‌ సల్మాన్‌తో ముఖాముఖి మాట్లాడి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని అనుకుంటున్నాడని, మాట వినకుంటే ఈసారి తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. అలాగే, పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా (Sidhu Moose Wala)ను చంపినట్టుగానే సల్మాన్‌ఖాన్‌ను అంతమొందిస్తామని అందులో హెచ్చరించారు. ఈ అంశంపై సల్మాన్‌ కార్యాలయ సిబ్బంది ముంబయిలోని బంద్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రోహిత్‌ గార్గ్‌ అనే వ్యక్తి ఐడీతో మెయిల్‌ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఘటనపై విచారణ జరిపిన బంద్రా పోలీసులు.. మెయిల్‌ పంపిన వ్యక్తి రాజస్థాన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఆదివారం రాజస్థాన్‌ పోలీసులతో కలిసి నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. గోల్డీ భాయ్‌ అలియాస్‌ గోల్డీ బ్రార్ అనే వ్యక్తి గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ (Lawrence Bishnoi) అనుచరుడుని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఇతడు సిద్దూ మూసేవాలా హత్య కేసులో అరెస్టై బటిండా జైలులో ఉన్నాడు. మరోవైపు, లారెన్స్‌ బిష్ణోయ్‌పై కూడా సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు రావడంతో పోలీసులు అరెస్టు చేయడంతో దిల్లీ జైలులో ఉన్నాడు.

సల్మాన్‌ఖాన్‌కు బిష్ణోయ్‌ నుంచి బెదిరింపులు రావడం ఇది తొలిసారేం కాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా బిష్ణోయ్‌ల మనోభావాలను సల్మాన్‌ఖాన్‌ దెబ్బతీశారంటూ లారెన్స్‌ బిష్ణోయ్‌ వ్యాఖ్యానించాడు. గతేడాది లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌నుంచి ఆయన ప్రాణాలకు ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో నవంబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ముంబయి పోలీసులతో అప్పటికే ఉన్న ఎక్స్‌ గ్రేడ్‌ భద్రతను Y+గా అప్‌గ్రేడ్‌ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డ్‌లు సల్మాన్‌కు అనునిత్యం భద్రతగా ఉంటున్నారు. ఆయన ఇంటి వద్ద కూడా ఇద్దరు భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు