విద్యార్థినిపై దారుణం.. టీచర్‌కు పదేళ్లు జైలు శిక్ష, ₹10లక్షల జరిమానా

రాజస్థాన్‌లో విద్యార్థిని జీవితాన్ని నాశనం చేసిన ఓ ఉపాధ్యాయుడికి న్యాయస్థానం కఠినశిక్ష విధించింది.

Published : 06 Jul 2023 21:09 IST

జైపుర్: విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన గురువే ఓ విద్యార్థిని జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఆమె లైంగిక దాడికి పాల్పడి ఆ ఘోరాన్ని వీడియో చిత్రీకరించాడు. ఏడేళ్ల క్రితం జరిగిన ఈ కేసులో నిందితుడికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్‌లోని బుందీ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదివే విద్యార్థినిపై అదే స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసే విశ్వేంద్ర మీనా(32) లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా వీడియోను చిత్రీకరించి కిరాతకంగా వ్యవహరించాడు. ఈ విషయం బయటకు చెబితే వీడియోలను ఆన్‌లైన్‌లో పెడతానని, పరీక్షల్లో ఫెయిల్‌ చేస్తారంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం బాధితురాలి తండ్రికి తెలియడంతో 2016 నవంబర్‌ 10న పోలీసులను ఆశ్రయించారు. తన కుమార్తెపై జరిగిన దారుణంపై ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసును విచారించిన పోక్సో న్యాయస్థానం నిందితుడికి రూ.10లక్షల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు