Jaipur Express: అతడికి షార్ట్‌ టెంపర్‌.. కనిపించిన వారిని కాల్చుకుంటూ పోయాడు..!

ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ ప్రవర్తనే సోమవారం ఉదయం జైపుర్ ఎక్స్‌ప్రెస్‌(Jaipur Express)లో కాల్పుల ఘటనకు కారణమైందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. 

Updated : 31 Jul 2023 13:43 IST

ముంబయి: జైపుర్ ఎక్స్‌ప్రెస్‌(Jaipur Express)లో ఈ తెల్లవారుజామున చోటుచేసుకున్న కాల్పులు తీవ్ర కలకలం సృష్టించాయి. రాజస్థాన్‌లోని జైపుర్ నుంచి ముంబయి వెళ్తున్న రైల్లో ఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ విచక్షణా రహితంగా కాల్పులు జరపగా.. నలుగురు మృతి చెందారు. పాల్ఘర్‌ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. కాల్పులకు పాల్పడిన నిందితుడి ప్రవర్తన గురించి సంబంధిత ఉన్నతాధికారి ఒకరు మీడియాతో మాట్లాడారు.

సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(Railway Protection Force (RPF)) కానిస్టేబుల్ చేతన్ సింగ్‌ తన సీనియర్ ఏఎస్సై టికారామ్ మీనాను కాల్చి చంపేశాడు. తర్వాత మరో బోగీలోని ముగ్గురు ప్రయాణికులపై కాల్పులు జరపడంతో వారు కూడా ఘటనాస్థలంలోని ప్రాణాలు కోల్పోయారు. అనంతరం తర్వాతి స్టేషన్‌లో రైలు దూకి, పారిపోయేందుకు యత్నించి పట్టుబడ్డాడు. దీనిపై ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ జనరల్‌(వెస్టర్న్ రైల్వే) ప్రవీణ్ సిన్హా మీడియాతో మాట్లాడారు. ‘అతడికి షార్ట్‌ టెంపర్. వెంటనే కోపం తెచ్చుకునే స్వభావం ఉంది. ఆ సమయంలో పెద్ద గొడవేం జరగలేదు. కానీ అతడు క్షణికావేశంతో తన సీనియర్‌ను కాల్చివేశాడు. తర్వాత కనిపించిన వారిని కాల్చుకుంటూ పోయాడు’ అని తెలిపారు. మరోపక్క తాను మానసికంగా వేధింపులకు గురయ్యాయని చేతన్‌ కూడా ఫిర్యాదు చేశాడు.

చిట్టితల్లీ.. మన్నించమ్మా!

చేతన్‌ ఉత్తర్‌ప్రదేశ్‌(Uttar Pradesh)వాసి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన టికారామ్‌ది రాజస్థాన్‌(Rajasthan). 2025లో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఏఎస్సై కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. అలాగే మృతి చెందిన ముగ్గురు ప్రయాణికులకు కూడా పరిహారం ఇచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. 

రైళ్లలో భద్రత కోసం ఆర్‌పీఎఫ్(RPF) సిబ్బందికి ఎస్కార్ట్ డ్యూటీ వేస్తారు. జైపుర్ రైల్లో ఏఎస్సై, చేతన్‌ సహా నలుగురు సిబ్బంది ఆ విధుల్లో ఉన్నారు. వారు గుజరాత్‌లోని సూరత్‌లో రైలెక్కారు. ఈ ఘటనపై మిగతా ఇద్దరు సిబ్బందిని కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని