Basara: బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని మృతి

నిర్మల్‌ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని మృతిచెందింది. పీయూసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న లిఖిత.. హాస్టల్‌ నాలుగో అంతస్తు పైనుంచి కిందపడింది.

Updated : 22 Jul 2023 16:18 IST

ముథోల్‌: బాసర ఆర్జీయూకేటీలో మరో విషాదం చోటుచేసుకుంది. వరుసగా రెండో రోజు మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం బాసర ట్రిపుల్‌ ఐటీలో కలకలం రేపింది. రెండురోజులు క్రితం పీయూసీ మెదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దీపిక మూత్రశాలలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సంఘటన నుంచి తేరుకోకముందే గురువారం వేకువజామున 2 గంటల ప్రాంతంలో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న లిఖిత(17) అనే విద్యార్థిని వసతి గృహం 4వ అంతస్తు నుంచి కిందపడింది.

తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం భైంస ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, లిఖిత అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇది ఆత్మహత్య.. లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ట్రిపుల్‌ ఐటీ అధికారులు మాత్రం ప్రమాదవశాత్తు జరిగిందని చెబుతున్నారు. ప్రమాదమా.. లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

లిఖిత స్వస్థలం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌. బుర్ర రాజు, రేణుక దంపతుల పెద్ద కుమార్తె. గజ్వేల్‌లో మిర్చిబండి నిర్వహిస్తూ.. రాజు పిల్లలను చదివిస్తున్నారు. వారం రోజుల క్రితమే లిఖిత హాస్టల్‌కు వెళ్లిందని.. ఇంతలోనే ఇలా జరగడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

లిఖిత మరణం ప్రమాదవశాత్తు జరిగింది: ఇంఛార్జ్‌ వీసీ

నిర్మల్‌ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న విద్యార్థిని లిఖిత మృతదేహాన్ని ఆర్జీయూకేటీ ఇంఛార్జ్‌ వీసీ వెంకటరమణ పరిశీలించారు. లిఖిత మృతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘విద్యార్థిని మృతి దురదృష్టకరం. లిఖిత మరణం ప్రమాదవశాత్తు జరిగింది. ఆర్జీయూకేటీలో మరణాలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. విద్యార్థులు మనోధైర్యం కోల్పోవద్దు’’ అని ఇంఛార్జ్‌ వీసీ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని