బెల్టుతో కొట్టినట్టు తేలితే చర్యలు: ఏఎస్పీ సుప్రజ

చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం రాత్రి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఓ ఎస్‌ఐ బెల్టుతో కొట్టిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. ..

Published : 07 Dec 2020 01:05 IST

తిరుపతి నేర విభాగం: చిత్తూరు జిల్లా తిరుపతిలో శనివారం రాత్రి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళను ఓ ఎస్‌ఐ బెల్టుతో కొట్టిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. ఎమ్మార్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్సై బెల్ట్‌తో తనపై దాడి చేశాడని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై తిరుపతి అర్బన్‌ ఏఎస్సీ సుప్రజ స్పందించారు. విచారణలో బెల్ట్‌తో కొట్టినట్లు తేలితే ఎస్సైపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ చెప్పారు. తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఘటనపై విచారణ చేపట్టిన ఏఎస్పీ సుప్రజ బాధితురాలిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై ఆందోళన చేస్తున్న రాజకీయపక్షాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతోనూ ఆమె మాట్లాడారు. ఎస్సై కొట్టినట్లు బాధితురాలు చెబుతోందని, అదే నిజమని తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఎస్సైని సస్పెండ్‌ చేయాలి..
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళపై దాడి చేసిన ఎస్సైని తక్షణమే సస్పెండ్ చేయాలంటూ తెదేపా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ఎమ్మార్ పల్లి స్టేషన్‌కు తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతో కలిసి ఆమె వెళ్లారు. ఘటనపై విచారణ జరుపుతున్న ఏఎస్పీ సుప్రజను కలిసి మాట్లాడారు. అనంతరం అనిత మీడియాతో మాట్లాడుతూ.. బాధితురాలికి తెదేపా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి..  బాధితురాలిపై ఎస్‌ఐ బెల్టుతో దాడి



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని