ఐదుగురు ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్య

రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Published : 26 Apr 2024 04:23 IST

నస్పూర్‌, హన్వాడ, పెద్దవంగర, భద్రాచలం పట్టణం, సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెందిన విద్యార్థులు ప్రాణం తీసుకుని అయినవారికి రోదన మిగిల్చారు. బుధవారం జరిగిన ఘటనలు కొన్ని గురువారం వెలుగులోకి వచ్చాయి.

  • మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌లోని సుభాష్‌నగర్‌కు చెందిన విద్యార్థి(17) ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  
  • మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం మునిమోక్షం గ్రామానికి చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థి(17) ఫెయిలయ్యాడు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులు ధైర్యం చెప్పినా బుధవారం రాత్రి పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు.
  •  మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం చిట్యాలకు చెందిన విద్యార్థిని(16) మొదటి సంవత్సరంలో ఫెయిలైంది. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. ఒక్క రోజు కూలి పనికి వెళ్లకపోయినా బతికుండేదానివి బిడ్డా అని తల్లిదండ్రులు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
  •  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని భగవాన్‌దాస్‌ కాలనీకి చెందిన యువతి(19) గతేడాది మ్యాథ్స్‌లో ఫెయిల్‌ కావడంతో ఈ ఏడాది మళ్లీ రాసింది. ఉత్తీర్ణురాలు కాకపోవడంతో మనస్తాపానికి గురై బుధవారం సాయంత్రం బలవన్మరణానికి పాల్పడింది.
  • హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ ఠాణా పరిధిలోని రాజ్‌మోహల్లా ప్రాంతానికి చెందిన విద్యార్థి(17) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్‌ కావడంతో ఇంట్లో ఉరివేసుకున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని