ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు

ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు.

Published : 26 Apr 2024 04:28 IST

యువ వ్యాపారి సజీవ దహనం
పటాన్‌చెరు శివారు అవుటర్‌పై ఘటన

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు బాహ్యవలయ రహదారిపై గురువారం ఈ దారుణం చోటుచేసుకుంది. ఎస్సై రాజేష్‌ నాయక్‌ కథనం ప్రకారం..సంగారెడ్డి జిల్లా బీరంగూడ జయలక్ష్మి నగర్‌ ఫేజ్‌-3కి చెందిన శిరీష్‌(33) మెడికల్‌ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. సుల్తాన్‌పూర్‌లోని తన స్నేహితుడి ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్తున్నట్టు కుటుంబ సభ్యులకు చెప్పి బుధవారం సాయంత్రం మరో మిత్రుడి కారులో బయల్దేరారు.

గురువారం వేకువజామున అక్కణ్నుంచి తిరుగుప్రయాణమయ్యారు. ఉదయం 5.30 గంటల సమయంలో ముత్తంగి టోల్‌ప్లాజాకు కొద్ది దూరంలో బాహ్య వలయ రహదారిపై ఆగి ఉన్న బొగ్గులారీని కారు వెనక నుంచి ఢీకొంది. అనంతరం కారు అదుపుతప్పి..లారీకి బాహ్య వలయ రహదారి రెయిలింగ్‌కు మధ్య ఇరుక్కుపోయింది. వెనువెంటనే కారులో మంటలు వ్యాపించడం, కారు డోర్లు తెరిచే పరిస్థితి లేకపోవడంతో శిరీష్‌ సజీవ దహనమయ్యారు. ప్రమాదం జరిగిన వైపు లారీకీ మంటలు వ్యాపించాయి. అటువైపు వెళ్తున్న ప్రయాణికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. రెయిలింగ్‌కు, లారీకి మధ్య ఇరుక్కుపోయిన కారును రెండు గంటలు శ్రమించి..రెండు పొక్లెయిన్ల సాయంతో బయటికి తీశారు. అందులో ఉన్న మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శిరీష్‌కు వివాహమై ఏడాది కూడా పూర్తికాలేదని, ఇంతలోనే ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని