Accident: యూపీలో ఘోరం.. ఆగిఉన్న బస్సుపైకి దూసుకొచ్చిన ట్రక్కు.. 18 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బారాబంకి జిల్లా రాంస్నేహిఘాట్‌ ప్రాంతంలో డబుల్‌ డెక్కర్‌ బస్‌ను ట్రక్కు ఢీకొంది.

Updated : 28 Jul 2021 10:05 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు పక్కన నిలిచిఉన్న డబుల్‌ డెక్కర్‌ బస్సుపైకి ఓ ట్రక్కు అతివేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందగా.. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

హరియాణాలోని అంబాలా నుంచి దాదాపు 130 మంది ప్రయాణికులతో ఓ డబుల్ డెక్కర్‌ బస్సు మంగళవారం బయల్దేరింది. అయితే రాత్రి 8 గంటల ప్రాంతంలో లఖ్‌నవూ - అయోధ్య జాతీయ రహదారిపై బస్సు బ్రేక్‌డౌన్‌ అయ్యింది. దీంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. రిపేర్‌ అవడానికి టైం పడుతుందని డ్రైవర్‌ చెప్పడంతో వాహనంలోని కొంతమంది కిందకు దిగి నేలపై నిద్రపోయారు. మరికొంతమంది బస్సులోనే విశ్రాంతి తీసుకున్నారు. అయితే రాత్రి 11 గంటల తర్వాత లఖ్‌నవూ నుంచి వస్తున్న ఓ ట్రక్కు రోడ్డుపై నిద్రిస్తున్న వారి మీద నుంచి వెళ్లి బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చాలా మంది గాయపడ్డారు. బస్సులోని వారంతా వలస కూలీలే. హరియాణాలో పనిచేస్తున్న వీరంతా స్వస్థలానికి వెళ్లేందుకు బస్సులో బయల్దేరగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.  ట్రక్కు అతివేగంతో పాటు వర్షం కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు కన్పించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. 

మోదీ దిగ్భ్రాంతి..

రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఘటనపై యూపీ సర్కారుతో మాట్లాడి క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందించాలని సూచించినట్లు తెలిపారు. అంతేగాక, మృతుల కుటుంబాలకు రూ. 2లక్షలు, గాయపడినవారికి రూ. 50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. అటు రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కూడా ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్నిరకాల సహాయం అందించేందుకు జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని