Crime News: మరదలిపై కన్నేసి మట్టుబెట్టిన బావ.. శిరీష హత్యకేసులో వీడిన మిస్టరీ

తెలంగాణలో సంచలనం సృష్టించిన పారామెడికల్‌ విద్యార్థిని శిరీష హత్యకేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్‌ అని పోలీసులు తేల్చారు.

Updated : 14 Jun 2023 23:38 IST

వికారాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన పారామెడికల్‌ విద్యార్థిని శిరీష హత్యకేసును పోలీసులు ఛేదించారు. శిరీషను దారుణంగా హత్య చేసింది ఆమె బావ అనిల్‌ అని పోలీసులు తేల్చారు. శారీరక సంబంధానికి  ఒప్పుకోకపోవడం వల్లే ఆమెను హతమార్చినట్టు ఎస్పీ తెలిపారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.

శిరీషకు శారీరకంగా దగ్గరై, ఆమెను కూడా పెళ్లి చేసుకోవాలని అనిల్‌కు దురాలోచన ఉంది. ఇందుకు శిరీష అతనికి సహకరించలేదు. శిరీష తరచూ ఫోన్‌లలో మరో వ్యక్తితో చాటింగ్‌ చేయడం, మాట్లాడుతుండటంతో అనిల్‌ మరింత కక్ష పెంచుకున్నారు. ఈ విషయంలో ఆమె తండ్రి, సోదరుడు..  బావ అనిల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. పలుమార్లు అనిల్‌ ఆమెపై దాడి చేశాడు. హత్యకు ముందు రోజు సాయంత్రం అనిల్‌ కొట్టడంతో శిరీష ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. శిరీష వెనుకాలే ఆమెను అనుసరిస్తూ వెళ్లిన అనిల్‌ ఆమెతో గొడవపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నిందితుడు బీరు సీసాతో దాడిచేసి నీటికుంటలో ముంచి హతమార్చాడు. నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులో కేసు విచారణ జరుపుతామని వికారాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో శిరీష పై అత్యాచారం జరగలేదని వెల్లడైనట్టు ఎస్పీ చెప్పారు.

ఏం జరిగిందంటే?

వికారాబాద్‌ జిల్లా పరిగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కాళ్లాపూర్‌ గ్రామానికి చెందిన శిరీష (19) ఇంటర్‌ పూర్తిచేసింది. వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్‌ హైదరాబాద్‌లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్‌ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్‌కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్‌ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్‌కు ఫోన్‌ చేసి.. శిరీష వంట చేయడంలేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్‌ వచ్చిన అనిల్‌.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది.

ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆమె కోసం గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. ఆమె రెండు కళ్లను పొడిచి, గొంతుకోసినట్లు, తలకు బలమైన గాయాలున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ప్రధానంగా శిరీష కుటుంబసభ్యులపైనే అనుమానం వ్యక్తం కావడంతో ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. బావపై అనుమానం బలపడటంతో, లోతుగా విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని